ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. లండన్‌లో తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు కోర్టను సమయం కోరారు. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు.. సీఎం జగన్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. 

మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడానికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా మూకే, యూఎస్‌ఏ, జర్మనీ, సింగపూర్, ఇతర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు. అయితే విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. ఇక, విజయసాయిరెడ్డి పిటిషన్‌పై తదుపరి విచారణ ఆగస్టు 30వ తేదీన జరగనుంది.