ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన ప్రమాణస్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి వరకు ఆ కుటుంబానికి అభిమానులుగా కొనసాగు తున్న వేలాది మంది అభిమానులు విజయవాడలోని ఐజీఎం సీ స్టేడియం వద్దకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎండ వేడిని కూడా లెక్కచేయకుండా తమ అభిమాన నాయకుడి ప్రమాణస్వీకారాన్ని కనులారా తిలకించారు. కాగా... వీరిందరిలోకి ఓ వ్యక్తి మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.

ఆయన తన శరీరానికి ఫ్యాన్ బిగించుకున్నాడు. ఎన్నికల్లో వైసీపీ గుర్తు ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పార్టీ గుర్తుని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేందుకు ఆయన అలా ఫ్యాన్ తన శరీరానికి బిగించుకున్నాడు. నిన్నటి కార్యక్రమంలో కూడా ఫ్యాన్ గుర్తు విజయానికి సంకేతంగా ఉండాలని ఆ రూపంలో ఆయన అక్కడికి వచ్చాడు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పెద్దాయన్నుంచి జగన్‌ వరకు నేను అభిమానిని. గత ఎన్నికల్లో నూ, పాదయాత్రలోనూ ఇదే తరహాలో బ్యాటరీలు, వైర్ల సాయంతో ఇలా ఒంటికి ఫ్యాన్‌ బిగించుకుని తిరిగా ను. ఇన్నాళ్ల ఎదురుచూపు తర్వాత జగన్‌ ప్రమాణ స్వీకారానికి రాకుండా ఎలా ఉంటాను? అందుకే ఇదే ఫ్యాన్‌ బిగించుకుని మళ్లీ ఇక్కడకు వచ్చాను. ఓపికున్నంత వరకూ ఇలా ఆయన వెనుకే తిరుగుతుంటాను.’’ అని పేర్కొనడం విశేషం.