మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కడప కేంద్రంగా ఈరోజు పలువురిని విచారించేందుకు సిద్దమయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కడప కేంద్రంగా ఈరోజు పలువురిని విచారించేందుకు సిద్దమయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాల్సిందిగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. శనివారం విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 24 తర్వాత అందుబాటులో ఉంటానని సీబీఐకి తెలిపినట్టుగా చెప్పారు. ఈరోజు విచారణపై మీడియాలో వార్తలు చూసి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు ఫోన్ చేశానని చెప్పారు. అయితే సీబీఐ వైపు నుంచి ఎలాంటి రిప్లై రాలేదని తెలిపారు. అయినప్పటికీ ఉదయం 10 గంటల తర్వాత సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతానని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను 23వ తేదీన విచారణకు హాజరుకాలేనని భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ క్రమంలోనే నేడు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీచేసింది.
ఇక, ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండుసార్లు విచారించారు. గత నెల 28న మొదటిసారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించగా.. తాజాగా శుక్రవారం(ఫిబ్రవరి 24) మరోసారి ఆయనను అధికారులు ప్రశ్నించారు. శుక్రవారం అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. సీబీఐ విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను సీబీఐకి సహకరించానని చెప్పారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినంతవరకు సమాధానం చెప్పానని తెలిపారు. జాగ్రత్తగా వార్తలు ప్రసారం చేయాలని మీడియాను కోరారు. తాను విజయమ్మను కలిస్తే బెదిరించి వచ్చానని కొందరు డిబేట్లు పెట్టి ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను దుబాయ్‌కి పారిపోయానని ఒక వర్గం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. అటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు.
కేసు విచారణ జరుగుతన్న సమయంలో మీడియా చేసే ఇలాంటి చర్యల వల్ల విచారణపై ఏ విధమైన ప్రచారం పడుతుందో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఒక అబద్దాన్ని 0 నుంచి 100కు.. ఒక నిజాన్ని 100 నుంచి 0 చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వాస్తవాలు లక్ష్యంగా కాకుండా వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతుందని చెప్పారు. వివేకానందరెడ్డి మరణించిన సమయంలో దొరికిన లేఖను బహిర్గతం చేయాలని సీబీఐని కోరినట్టుగా చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ తనకు తెలిసిన వాస్తవాలతో సీబీఐకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు.
గూగుల్ టేక్అవుట్ అంటున్నారని.. అది గూగుల్ టేక్అవుటా? లేదా టీడీపీ టేక్‌అవుటా? అనేది భవిష్యత్తులో తేలుతుందని అన్నారు. సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌లో చెప్పిన విషయాన్ని టీడీపీ ఏడాది క్రితమే ఎలా చెప్పిందని ప్రశ్నించారు. గత విచారణ సందర్భంగా మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారని.. ఈసారి అలా ఏం చెప్పలేదని అవినాష్ రెడ్డి తెలిపారు.
