వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సీబీఐ  విచారణకు హాజరయ్యారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు మూడు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ మాత్రం ఈ కేసులో విచారణ సరైన మార్గంలో జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని.. తనపై తప్పుడు జరుగుతుందని ఆయన చెబుతున్నారు. 

మరోవైపు ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఉత్తర్వలును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయమూర్తి పొడిగించారు. అదే సమయంలో తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. 

ఇక, అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తనను కూడా ఇంప్లీడ్ చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు.. అవినాష్ రెడ్డి, సీబీఐ, సునీతా రెడ్డి తరఫు వాదనలపై విచారణ జరిపింది. సీబీఐ అవినాష్ రెడ్డిని ప్రధాన కుట్రదారుగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వివేకానంద రెడ్డి 2010లో ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారని, వారికి ఒక కుమారుడు ఉన్నారని ఆయన వాదనలు వినిపించారు. . అతని రెండవ వివాహం ఫలితంగా, అతని కుటుంబానికి ఆర్థిక లావాదేవీలతో సహా విభేదాలు వచ్చాయని అన్నారు. కుటుంబంతో ఆస్తి తగాదాల కారణంగానే వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని సీనియర్ న్యాయవాది వాదించారు. 

ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు అవినాష్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని, వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున మంగళవారం సీబీఐ ఎదుట హాజరుకావడంతో అవినాష్ రెడ్డికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించింది.

ఇక, సీబీఐ ఈ కేసుకు సంబంధించిన డైరీని సీల్డ్ కవర్‌లో సమర్పించింది. హత్య స్థలంలో దొరికిన లేఖ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికతో పాటు 35 మంది సాక్షుల వాంగ్మూలం, 10 డాక్యుమెంట్లు, కొన్ని ఫొటోలు, హార్డ్ డిస్క్‌లను కోర్టు ముందు ఉంచింది. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని అవినాష్‌రెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్నాయని సీబీఐ న్యాయవాది వాదించారు.

సునీతారెడ్డి తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. కేసును ప్రధాన అంశం నుంచి పక్కదారి పట్టించేందుకే అవినాష్ రెడ్డి సీబీఐపై, సునీతా రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. హత్యకు ప్రధాన కుట్రదారు అవినాష్ రెడ్డి అని సునీతా రెడ్డి తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. హత్య గురించి తెలిసిన రెండు నిమిషాల్లో అవినాష్‌రెడ్డి లాంటి వ్యక్తి ఎలా అక్కడికి చేరుకుంటాడని డాక్టర్‌ సునీతారెడ్డి తన పిటిషన్‌లో ప్రశ్నించారు. . కడప ఎంపీ టికెట్‌కు వివేకా అడ్డుగా ఉన్నారనే హత్య చేయించారని.. అంతమకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కావాలనే ఓడించారని అన్నారు.