గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారులు, మహిళలపై అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష వేస్తామంటూ ఏపీ ప్రభుత్వం దిశ బిల్లును  అసెంబ్లీలో ఆమోదించిన రోజే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.

కాగా... ఈ ఘటనపై మహిళా సంఘాలు స్పందించాయి. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆ హాస్పిటల్ వద్దకు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.  ‘నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారా.. లేక రెడ్డి సామాజికవర్గంవాడని చెప్పి వదిలిపెడతారా’’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. వారితో టీడీపీ, బీజేపీ మహిళా నేతలు కూడా గొంతు కలిపారు. దీంతో జీజీహెచ్‌ ప్రాంతంలో కొద్దిగంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు లోని నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్లి, అమ్మమ్మలతో బాధిత బాలిక కలిసి ఉంటోంది. భర్తకు దూరంగా నర్సుగా పనిచేస్తూ.. కుటుంబాన్నిపోషిస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు కాగా, బాలిక తల్లి వద్ద, కుమారుడు తండ్రి వద్ద పెరుగుతున్నారు. ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలిక యూకేజీ చదువుతోంది. వారి ఇంటి కింద పోర్షన్‌లో లక్ష్మారెడ్డి (19) ఇంటర్‌ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజనం చేసి రెండు గంటల సమయంలో తల్లి డ్యూటీకి వెళ్లింది. అమ్మమ్మ గంట తర్వాత రైతు బజారుకు వెళ్లింది.

అప్పుడే బాలిక స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని అదునుగా చేసుకున్న లక్ష్మా రెడ్డి ఆ చిన్నారిపై అత్యాచారినికి పాల్పడ్డాడు. కాగా... కడుపులో నొప్పిగా ఉందని.. తనపై జరిగిన దాడిని చిన్నారి తల్లికి చెప్పింది. ఆ వెంటనే కుమార్తెను వెంటపెట్టుకొని వెళ్లి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. ఐపీసీ 376, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. మరునాడు ఉదయం విషయం బయటకు రావడంతో మహిళా సంఘాలు ఆస్పత్రి వద్దే ఆందోళన చేపట్టాయి. బాలికను పరామర్శించి, తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.