చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో హరిప్రసాద్ అనే యువకుడు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి నడుచుకుంటూ స్వగ్రామానికి వచ్చాడు. అయితే, అతను మృత్యువాత పడ్డాడు.

చిత్తూరు జిల్లా రామసముద్రం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృత్యుబారిన పడిన అతని వద్దకు చేరుకోవడానికి ఎవరూ సాహసించలేదు. కరోనా పాజిటివ్ భయంతో వారు దూరంగా ఉన్నారు. దీంతో 24 గంటల పాటు అతని శవం ఊరి చివర పొలాల్లోనే ఉంది. అతనికి కరోనా వైరస్ సోకలేదని తేలిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బుధవారం ఉదయం ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.... కొత్తగా గత 24 గంటల్లో 73 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,332కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 31 మంది మరణించారు. గత ఐదు రోజులుగా మరణాలు నమోదు కాలేదు.

ఇప్పటి వరకు 287 మంది కోలుకుని అస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1014 ఉంది. గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 29 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 3, తూర్పు గోదావరి జిల్లో ఒక కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో నాలుగు కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి.  పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగానే ఉంది. 

కర్నూలు జిల్లా 343 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 283 కేసులతో గుంటూరు జిల్ాల రెండో స్థానంలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో గత కొద్ది రోజులు కరోనా వైరస్ విజృంభిస్తోంది.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 58
చిత్తూరు 77
తూర్పు గోదావరి 40
గుంటూరు 283
కడప 69
కృష్ణా 236
కర్నూలు 343
నెల్లూరు 82
ప్రకాశం 60
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 23
పశ్చిమ గోదావరి 56