పెళ్లై మూడు నెలలకే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన బత్తిన అశోక్‌(32) సుమారు పదేళ్ల క్రితం విశాఖ వచ్చాడు. అప్పటి నుంచి ఆరిలోవలో ఉంటూ జీవీఎంసీ వాటర్‌ సప్‌లై డిపార్ట్‌మెంట్‌ బోర్‌వెల్స్‌ విభాగంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

మూడు నెలల క్రితమే.. ఆయనకు పాలకొండకు చెందిన శోభారాణి అనే యువతితో వివాహమైంది. వారిద్దరూ కలిసి ఆరిలోవ బాలాజీనగర్‌లో ఓ అద్దింట్లో ఉంటున్నారు. ఆషాఢ మాసంలో శోభారాణి కన్నవారి ఇంటి వద్ద ఉండి ఇటీవలే భర్త వద్దకు తిరిగి వచ్చింది

 ఈ క్రమంలో అశోక్‌ సోమవారం మధ్యాహ్నం బైక్‌పై నగరానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలై అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుడికాలు రెండు ముక్కలైంది. విషయం తెలుసుకున్న ఆరిలోవ ట్రాఫిక్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న భార్య శోభారాణి కేజీహెచ్‌ మార్చురీ వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమైంది.