తనను బలవంతంగా వేషం మార్చి హిజ్రాగా మార్చారని.. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేస్తామని అంటున్నారని.. అలా మారడం తనకు ఇష్టం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తది వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండకు చెందిన శ్రీకాంత్ అలియాస్ ప్రసాద్(18) కి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో.. తమ్ముడితో కలిసి తన అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ఏడాదిన్నర క్రితం వరకు మహబూబ్‌నగర్‌లో చదువుకున్నాడు. ఆ సమయంలోనే జుట్టు పెంచుకోవడం ప్రారంభించాడు. అదేమని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. దేవుడికి మొక్కు అని చెప్పేవాడు.

ఏడాదిన్నర క్రితం ప్రైవేటు పరిశ్రమలో పని పేరుతో వరంగల్‌ వెళ్తున్నట్లు చెప్పాడు. అప్పుడప్పుడూ కుటుంబీకులకు ఫోన్‌ చేసేవాడు. రెండు నెలల క్రితం సోదరుడికి ఫోన్‌చేసి.. కడపలో ఉంటున్నానని చెప్పాడు. ఈ క్రమంలో ఓ సారి అతని తమ్ముడు కడపకు వెళ్లివచ్చాడు. ఈ నెల 4న రాత్రి అతను ఆడవేషంలో తన మేనమామ కుమారుడు వినోద్‌కు వీడియో కాల్‌ చేశాడు. ‘‘నాకు స్త్రీ లక్షణాలు ఉన్నాయంటూ కొందరు హిజ్రాలు వారి మాదిరిగా వేషం వేయించారు. నా పేరును శ్రీలేఖ అని మార్చారు. ఇష్టం లేకున్నా హిజ్రాగా మారేందుకు శస్త్రచికిత్స చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇబ్బందులకు గురిచేశారు. నాకు అది ఇష్టం లేదు’’ అని పేర్కొన్నాడు. 

తనలాగే జడ్చర్ల పాతబజార్‌, దేవరకద్ర, కోయిలకొండకు చెందిన ముగ్గురు యువకులు హిజ్రాల చెరలో ఉన్నారని చెప్పాడు. ‘‘మీరెవరూ ఇక్కడికి రాకండి. వస్తే.. ఇక్కడి హిజ్రాలు చంపేస్తారు’’ అని హెచ్చరించాడు. కాల్‌ మాట్లాడుతూనే పురుగుమందు తాగాడు.

వీళ్లు వెళ్లేసరికి శ్రీకాంత్ కొనఊపిరితో కొట్టుకుంటున్నాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే.. అతని శవాన్ని స్థానిక హిజ్రాలు స్వాధీనం చేసుకొని రూ.లక్ష ఇస్తేనే వదిలేస్తామంటూ బెదిరించడం గమనార్హం. బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.