అతనికి ఇటీవలే పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా అయిపోయింది. త్వరలోనే పెళ్లి చేద్దామని పెద్దలు అనుకుంటున్నారు. కాబోయే భార్యతో తరచూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలోనే ఏమైందో ఏమో తెలీదు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీకి చెందిన సోనూరాజ్, అతని తమ్ముడు సూరజ్‌రాజ్‌ చీమకుర్తిలోని గ్రానైట్‌ క్వారీల్లో ఆరేళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఇటీవల అతనికి పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా అయ్యింది. కాగా.. ఇటీవల తనతో నిశ్చితార్థం జరిగిన అమ్మాయితో సోనూరాజ్‌ ఫోన్‌లో మాట్లాడాడు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదుగానీ ఫోన్‌ పెట్టేశాక ఆమెకు మెసేజ్‌ పెట్టాడు. 

తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాన్నది ఆ మెసేజ్‌ సారాంశం. కంగారు పడిన ఆమె వెంటనే చీమకుర్తిలోనే ఉన్న అతడి తమ్ముడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. అతడు హుటాహుటిన ఇంటికి వెళ్లి చూడగా తన అన్న ఉరికి నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. క్షణంలో ఉరేసుకొని సోనూరాజ్‌ ఆత్మహత్య చేసుకోవడాన్ని తమ్ముడు సూరజ్‌రాజ్, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.