దాదాపు 7 నెలల కింద కొందరు యువకులు కొట్లాటకు దిగారు. అయితే.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అది కాస్త పోలీసుల కంట పడింది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరుకు చెందిన కావేరిపాకం యుగంధర్‌ తన స్నేహితుడు శ్రీకాంత్‌కు చెందిన ఇన్నోవా కారును తీసుకెళ్లగా అది ప్రమాదానికి గురైంది. దాని మరమ్మతుకు రూ.70 వేలు చెల్లించేందుకు యుగంధర్‌ నిరాకరించాడు. ఈ విషయాన్ని యుగంధర్‌ స్నేహితుడు తుమ్మగుంట రాజశేఖర్‌కు చెప్పడంతో స్నేహితులతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్లో యుగంధర్‌ను బయటకు తీసుకెళ్లి చితకబాదారు. ఈ సన్నివేశాలను స్నేహితుల్లో ఒకడైన కిరణ్‌ చిత్రీకరించాడు.

ఆ వీడియోలు రెండు రోజుల నుంచి సోషల్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో పోలీసులు దృష్టి సారించి ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌ నగరంలోని మరో కేసులోనూ సంబంధాలు ఉండటంతో రెండు కేసులు నమోదు చేసినట్లు నెల్లూరు నగర, రూరల్‌ డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, హరనాథరెడ్డి మంగళవారం తెలిపారు.