ఎస్సై నియామక ప్రక్రియలో అపశృతి... ప్రాణంతీసిన పరుగుపందెం (వీడియో)
ఖాకీ డ్రెస్ వేయాలన్న అతడి కల నేెరవేరకుండానే తనువు చాలించాడు. ఏపీలో ఎస్సై రిక్రూట్ మెంట్ కోసం నిర్వహించిన ఫిజికల్ టెస్ట్ లో పాల్గొన్న ఓ యువకుడు మైదానంలోనే కుప్పకూలి చనిపోయాడు.

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ రిక్రూట్ మెంట్ లో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్ లో పాల్గొన్న యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మైదానంలో కుప్పకూలిన అతడిని హాస్నిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన యువకుడు మోహన్ కుమార్ పోలీస్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ గుంటూరులో జరిగిన ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్న మోహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మైదానంలోనే కుప్పకూలిపోవడంతో జిజిహెచ్ కు తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.
వీడియో
మోహన్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీస్ ఉద్యోగం సాధించడానికి ఎంతో కష్టపడిన కొడుకు ఆ కల నెరవేరకుండానే మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మోహన్ స్నేహితులు సైతం మృతదేహంవద్ద కన్నీటిపర్యంతం అవుతున్నారు.