విశాఖపట్నం: ఆన్ లైన్ యాప్ లో అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆన్ లైన్ యాప్ సిబ్బంది తీవ్ర ఒత్తిడి కారణంగానే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన అహల్య(25) ఎంబీఎ చదువుతోంది. అయితే అవసరాల నిమిత్తం ఆమె ఓ ఆన్ లైన్ యాప్ నుండి రూ.40వేలు అప్పు తీసుకుంది. కానీ ఆ అప్పును నిర్ణీత సమయంలో చెల్లించలేకపోవడంతో యాప్ సిబ్బంది నుండి ఆమెపై  ఒత్తిడి పెరిగింది. వెంటనే అప్పు తిరిగి చెల్లించాలని... లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. 

అప్పు చెల్లించడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో అహల్య దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.