కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ అపార్ట్మెంట్ పై నుండి దూకి యువకుడు మృత్యువాతపడ్డాడు. మద్యం మత్తులో యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఉయ్యూరు దుర్గా ఎస్టేట్స్ లో రామ్ తేజ్ అపార్ట్మెంట్ అరుణ్ కుమార్ (23)పాలిష్ వర్క్ చేస్తున్నాడు. గత ఐదు నెలలుగా ఈ అపార్ట్ మెంట్ లోనే వర్క్ చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు.  అయితే నిన్న(బుధవారం) అర్ధరాత్రి అపార్ట్ మెంట్ భవనంలోనే ఫుల్లుగా మద్యం సేవించాడు. ఈ మత్తులోనే అతడు ప్రమాదవశాత్తు అపార్ట్ మెంట్ నుండి కిందపడి  చనిపోయాడు. 

ఇవాళ ఉదయం ఈ విషయాన్ని గమనించిన మిగతా వర్కర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

మృతుని స్వగ్రామం విజయవాడ సమీపంలోని కండ్రికగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉయ్యూరు పట్టణ పోలీసులు తెలిపారు. పోస్టు మార్టం అనంతరం ఈ మరణంపై కాస్త క్లారిటీ రానున్నట్లు పోలీసులు తెలిపారు.