తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ అనుమానాలు
ysr congress party doubts on cms chandrababu naidu revanth reddy meeting: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. అధికారుల కమిటీ ఏర్పాటు కాలయాపన ప్రక్రియ అని అభిప్రాయపడింది.
అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. దీన్నొక కాలయాపన ప్రక్రియగా భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ నేతలు పేర్ని నాని, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు ఓ ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ నేతలు లేఖలో పేర్కొన్న అంశాలివే....
1. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం- విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోంది. దీన్నొక కాలయాపన ప్రక్రియగా భావిస్తున్నాం.
2. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు ఏంటి? అపరిష్కృత అంశాలు ఏంటి? పంచాల్సిన ఆస్తులు ఏంటి? ఎందుకు ముందుకు వెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులేంటి? అన్నదానిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత కూడా ఉంది. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల గుర్తింపునకు మళ్లీ కమిటీ అన్నట్టుగా చెప్పడం విభజిత సమస్యల పరిష్కారంలో మరింత జాప్యానికే దారితీస్తుందన్న సంకేతాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఇచ్చిందని అభిప్రాయపడుతున్నాం.
3. పార్లమెంటు చేసిన విభజన చట్టంలోని అంశాల అమలుపై సీనియర్ అధికారి గతంలో షీలా బేడీ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదంపై కూడా షీలా బేడీ కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సులపై అనేక దఫాలుగా 10 సంవత్సరాలుగా చర్చలు జరిగాయి. కొన్ని సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించనప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. చర్చలను ఆ దశ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి మళ్లీ కమిటీ ఏర్పాటు చేయడం అంటే.. వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకెళ్లడమేనని భావిస్తున్నాం.
4. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అపరిష్కృత అంశాలపై దృష్టిపెట్టాలని, దశాబ్దకాలంగా అంగుళం కూడా ముందుకు పడకపోవడంతో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి ఎదుట గొంతెత్తారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్ణీత కాలపరిమితిలోగా సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
5. ఆ హామీ మేరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు కూడా విభజిత సమస్యలపై చర్చల ప్రక్రియ వేగం అందుకుంది. వీటిని కూడా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టకుండా మళ్లీ కమిటీని ఏర్పాటు చేయడమంటే.. మళ్లీ వెనక్కి లాగడమే అవుతుందని భావిస్తున్నాం.
6. పైగా ఈ కమిటీ ఏర్పాటు అన్నది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా, వారి ప్రమేయం లేకుండా ఏర్పాటవుతోంది. విభజన చట్టంచేసింది పార్లమెంటు, దాన్ని అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కమిటీ ఏర్పాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
7. అలాగే, రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.7వేల కోట్ల విద్యుత్ బకాయిల విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చింది. తద్వారా ఆ బకాయిలు చెల్లింపునకు ఆదేశాలుకూడా ఇచ్చింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. దీనిపై దృష్టిపెట్టి.. పరిష్కారం సాధించే ప్రయత్నం ఇవ్వాళ్టి సమావేశంలో పెద్దగా జరిగినట్టు లేదు.
8. ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతం గొంతెండుతున్న పరిస్థితుల్లో కూడా విద్యుత్ రూపేణా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ కాల్వ నుంచి నీటిని ఇష్టానుసారం విడిచిపెడుతోంది. దీనిపై తక్షణం పరిష్కారానికి ప్రయత్నించి ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా సమావేశం అసంపూర్తిగా ముగియడం రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే...
9. ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాల్వ, స్పిల్‌వే భాగాన్ని వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ ఇచ్చిన హామీ మేరకు సంయమనం పాటించాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబుగారు దీనిపై కూడా గట్టి దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించకపోవడం- విభజిత సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
10. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ఏపీ పోర్టుల్లోనూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లోనూ తెలంగాణ వాటా కోరినట్టుగా వివిధ మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. ఏడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా విలీనానికి ఏపీ సుముఖంగా ఉన్నట్టుగా కూడా ప్రచారం నడిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీనిపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రికాని, ఒక అధికారికాని ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ప్రజల అనుమానాలను బలపరిచినట్టే అవుతుంది.