Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ కొత్త ప్లాన్‌... ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో జగన్‌ భేటీ

2019లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ.. ఈసారి దారుణంగా పతనమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన అభ్యర్థులతో వైసీపీ అధినేత భేటీ అయి.. పలు అంశాలపై చర్చించారు.  

YCP's new plan... Jagan met with the defeated MLA candidates
Author
First Published Jun 10, 2024, 10:17 PM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న వైసీపీ.. ఈసారి 11 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలను సమీక్షించుకునే పనిలో పడ్డారు. ఆ పార్టీ అగ్రనేతలు. ఓటమి తర్వాత ప్రెస్‌ మీట్‌ పెట్టి.. లక్షల కోట్లు సంక్షేమం అందించినా ప్రజలు మోసం చేశారంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, మంత్రులతో సోమవారం తాడేపల్లిలోని కార్యాలయంలో భేటీ అయ్యారు జగన్మోహన్‌ రెడ్డి. నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. కేడర్‌లో ధైర్యం నింపేందుకు, టీడీపీని ఎదురయ్యే దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అరాచక కాండ సాగిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. తమ పార్టీ కేడర్‌పై జరుగుతున్న దాడులకు కౌంటర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించుకుంది. కార్యకర్తలకు ధైర్యం చెబుతూనే వారి రక్షణ కోసం కార్యాచరణ అనుసరించాలని నిర్ణయించింది.  రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.... తద్వారా దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని జిల్లా ఎస్పీల వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఫిర్యాదు చేయిస్తారు. ఆపై కోర్టులో కూడా దావాలు వేయిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రొసీజర్లను లీగల్‌ టీం చూసుకునేలా వైయ‌స్ఆర్‌సీపీ ప్రణాళిక రూపొందించింది. 

అలాగే, ఎన్నికల ఫలితాల తర్వాత  వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని ,పేర్ని నాని, వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఖండించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జగ్గయ్యపేటలోనూ తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమన్నారు. వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును మేం గౌరవిస్తామన్న సామినేని ఉదయభాను... జగ్గయ్యపేటలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌కు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios