Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ కు రఘురామకృష్ణం రాజు లేఖ: కోరిక ఇదీ...

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఏదో రూపంలో రఘురామ కృష్ణం రాజు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

YCP rebel MP Raghurama Krishnam Raju writes letter to AP CM YS Jagan
Author
Amaravati, First Published Jun 10, 2021, 1:03 PM IST

అమరావతి: బెయిల్ మీద విడుదలైన తర్వాత వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఏదో రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మీడియాతో కేసు గురించి మాట్లాడవద్దని సుప్రీంకోర్టు విధించిన షరతును పాటిస్తూనేవేర్వేరు రూపాల్లో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. వృద్ధాప్య పింఛన్లను ఈ నెల నుంచి రూ.2,750కి పెంచి ఇవ్వాలని ఆయన జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఏడాదిగా పెండింగులో ఉన్న పింఛనును కూడా కలిపి రూ. 3 వేలు ఇవ్వాలని ఆయన కోరారు. 

తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛనును రూ. 2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో వైసీపి హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ హామీకి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించిందని ఆయన అన్నారు. 

ఇదిలావుంటే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినితి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన కేంద్ర జలశక్తి మంత్రి గజెంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిర్వాసితులకు పరిహారం చెల్లించే పేరుతో పెద్ద యెత్తున సొమ్ము దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు 

బుధవారంనాడు ఆయన గజేంద్ర షెకావత్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిర్వాసితులకు పునరావస పరిహారం చెల్లింపు పేరుతో నకిలీ ఖాతాలను, దొంగ లబ్ధిదారులను సృష్టించి భారీగా సోమ్ము చేసుకుంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచేశారని, 25 శాతం కమిషన్లు కొట్టేశారని ఆయన అన్నారు 

ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆయన అన్నారు. తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన గజేంద్ర షెకావత్ ను కోరారు దాదాపు గంట పాటు ఆయన గజేంద్ర షెకావత్ తో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపైనే కాకుండా తనను  ప్రభుత్వం వేధిస్తున్న తీరును కూడా వివరించారు.

ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, అక్రమాలను, కుంభకోణాలను మీడియా ద్వారా బయటపెడుతున్నందుకే తనపై సీఎం జగన్ కక్ష కట్టారని ఆయన ఆరోపించారు అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను పిటిషన్ వేయడం వల్లనే తనపై రాజద్రోహం కింద కేసు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిఐడి పోలీసులతో తనపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. సిఐడి కస్టడీలో తనను గాయపరిచారని ఆయన చెప్పారు. తన అరిపాదాలకు అయిన గాయాలను ఆయన గజేంద్ర షెకావత్ కు చూపించినట్లు తెలుస్తోంది.   

Follow Us:
Download App:
  • android
  • ios