Asianet News TeluguAsianet News Telugu

మీ బావ చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే అలా చేసారా? : పురంధీశ్వరిపై విజయసాయి సెటైర్లు

ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలై వుండి కనీసం సొంత వూళ్లో సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసిలను బరిలోకి నిలపకపోవడం ఏమిటి? జాతీయ స్థాయి నేత జాతి నేతగా ఎందుకు మారారు? అంటూ పురంధీశ్వరిపై సెటైర్లు వేసారు విజయసాయి రెడ్డి. 

YCP MP Vijayasai Reddy satires on Andhra Pradesh BJP Chief Purandeswari AKP
Author
First Published Nov 15, 2023, 11:51 AM IST

విశాఖపట్నం : వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురంధీశ్వరి మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. పురంధీశ్వరిని రాజకీయంగానే కాదు వ్యక్తిగత విషయాలపైనా వైసిపి ఎంపి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యక్షంగా బిజెపి పార్టీలో వుండి పరోక్షంగా తెలుగుదేశం పార్టీకోసం ఆమె పనిచేస్తున్నారని విజయసాయి ఆరోపిస్తున్నారు. ఇలా పురంధీశ్వరిపై విజయసాయి రెడ్డి  వరుస ట్వీట్లతో విరుచుకుపడతున్నారు.  

తాజాగా మరోసారి పురంధీశ్వరిపై భగ్గుమన్నారు విజయసాయి రెడ్డి. చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి!  జాతీయ స్థాయి నేతగా వుండి 'జాతి  నేత'గా ఎందుకు మారారు? అంటూ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలోని మీ స్వస్థలం కారంచేడులో బిజెపి సర్పంచులను లేదా ఎంపిటిసి, జడ్పిటిసిలను ఎందుకు పోటీలో నిలపలేదు? అప్పటికే మీరు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కదా! అంటూ పురంధీశ్వరిని నిలదీసారు విజయసాయి రెడ్డి. 

బిజెపిలోని చిన్న చిన్న నేతలు సైతం తమ ప్రాంతాల్లో సర్పంచ్,ఎంపిటిసి, జడ్పిటిసిలను బరిలో నిలిపారు... ఇలా పార్టీ కోసం నిబద్దత, నిజాయితీగా వ్యవహరించారని విజయసాయి పేర్కొన్నారు. కానీ జాతీయ నేతగా వున్న మీరెందుకు ఆ పని చేయలేదు? నాకు సమాధానం చెప్పకపోయినా సరే మీ కార్యకర్తలు అడిగితే ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. కొంపదీసి 'మా బావ కళ్లల్లో ఆనందం కోసం' అని నిజం చెబుతారా? అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేసారు. 

పురంధీశ్వరికి బిజెపి కంటే టిడిపి ప్రయోజనాలే ఎక్కువని అర్ధమవుతోందని విజయసాయి అన్నారు. బిజెపి పట్ల ఆమెకు వున్న చిత్తశుద్ది ఏమిటో గత ఎన్నికలను పరిశీలిస్తే అర్థమవుతుందని అన్నారు.  వెనకటికి ఒకామె...ఉట్టికి ఎగరలేదు కానీ స్వర్గానికి ఎగురుతా అందట! అలాగే పురంధీశ్వరి తీరు వుందని విజయసాయి రెడ్డి సెటైర్లు వేసారు. 

గతంలో కారంచేడులో జరిగిన  ఓ ఎన్నికలో అన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలను విజయసాయి రెడ్డి బయటపెట్టారు. ఈ క్రమంలోనే పురంధీశ్వరి కుటుంబం ఓట్లు కలిగిన 145వ పోలింగ్ బూత్ లో బీజీపికి కేవలం 6 ఓట్లు మాత్రమే పడ్డాయి... ఇందులో అసలు పురందేశ్వరి ఓటు ఉందా? అంటూ ఎద్దేవా చేసారు. బిజెపి అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షురాలే ఓటు వేయలేదా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు.  

బావ చంద్రబాబు పక్షపాతి అయిన పురంధీశ్వరికి  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటగింపు అయిపోయిందన్నారు. బిజెపి లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్దాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? అని ప్రశ్నించారు. ఇలా గట్టిగా అడిగితే మా ఓటు అక్కడ లేదు... వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్ళీ! అంటూ పురంధీశ్వరిపై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios