ప్రత్యేకహోదా, విభజన చట్టం అమలు విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షలో బీజేపీపైనా, ప్రధాని నరేంద్రమోడీపైనా తీవ్రంగా మండిపడ్డ ఆయన త్వరలోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

బీజేపీని ఏపీ ప్రజలు రాష్ట్రం నుంచి బహిష్కరిస్తారని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ ఢిల్లీలో దీక్షలో పాల్గొనే వారి కోసం తెలుగుదేశం పార్టీ ఛార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే కీలక నేతలు ఉన్నారు. వీరిలో బీజేపీ ఎంపీ హరిబాబు ఉండటం తీవ్ర కలకలం రేపింది.

ఈ ఫోటోలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు.  పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నా...రహస్యంగా టీడీపీ-బీజేపీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారంటూ మండిపడుతూ ట్వీట్ చేశారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని విజయసాయి హెచ్చరించారు.

ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ.200 కోట్ల ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేలకోట్లు దోచి పెట్టాడు. సొంత పనులకు హెలికాఫ్టర్, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారంటూ ట్వీట్ చేశారు.

ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షం!. అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలంటూ మండిపడ్డారు. అలాగే మరో ట్వీట్‌లో మంత్రి లోకేశ్‌కి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు .

హైదరాబాద్ మెట్రో కంటే ముందే అమరావతి-విజయవాడ మెట్రో కూత పెడుతుందన్నారు. మరి ఆ మెట్రో భూగర్భంలో నడుస్తుందా..? లేక అంతరిక్షంలో తిరుగుతుందా..? గ్రాఫిక్స్‌ కూడా దండగ అనుకుని కొన్ని ప్రాజెక్టులను ట్విట్టర్‌కే పరిమితం చేసినట్లున్నారు చంద్రబాబు’’ అంటూ ట్వీట్ చేశారు.