అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఆయన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల అపోలో ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయింది.

విజయసాయి రెడ్డికి కరోనా వైరస్ సోకినట్లు ఓ ఆంగ్లదినపత్రిక తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి స్వయంగా ఓ ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలో భాగంగా తనంత తానుగా వారం నుంచి పది రోజుల క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప టెలిఫోన్ కు కూడా అందుబాటులో ఉండనని చెప్పారు. అయితే, తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు మాత్రం చెప్పలేదు. 

ఇదిలావుంటే, విజయసాయి రెడ్డి వ్యక్తిగత సహాయకుడికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కాలంలో విజయసాయి రెడ్డి అమరావతి, విశాఖపట్నం, హైదరాబాదుల మధ్య విస్తృతంగా పర్యటించారు. ఇటీవలి కాదా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు పలువురు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పలు సందర్భంగాల్లో మాస్కు లేకుండా కూడా కనిపించారు.