న్యూఢిల్లీ: లోక్ సభలో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు తెలుగుదనం ఉట్టిపడేలా లోక్ సభలో అడుగుపెట్టారు. 

ఆరడుగుల అజానబావుడైన ఆయన పంచెకట్టులో ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రఘురామకృష్ణం రాజు ప్రమాణ స్వీకారానికి పంచెకట్టుతో రావడంతో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చుకున్నారు వైసీపీ నేతలు. 

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో హాజరైన రఘురామకృష్ణంరాజు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. అంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహించినప్పటికీ ఆయన మాత్రం ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు.