Asianet News TeluguAsianet News Telugu

మాకది అభ్యంతరం, ఇద్దరు వైసీపి ఎంపీలున్నారు: రఘురామ కేసులో రోహత్గీ

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలనే సిఐడి వాదనకు నిందితుడు తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం చెప్పారు.

YCP MP Raghurama Krishnam raju lawyer rejects medical tests in Managalagiri AIMS
Author
New Delhi, First Published May 17, 2021, 12:28 PM IST

న్యూఢిల్లీ: రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద తిరిగి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణను 79 మంది వింటున్నారని అంటూ వారంతా ఎవరు, రిజిస్ట్రీ ఎందుకు అనుమతించారని సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే అడిగారు. ఇప్పుడు 70 మంది ఉన్నారని, అది 67కు తగ్గిందని జస్టిస్ శరన్ చెప్పారు. 

రఘురామ కృష్ణమ రాజుకు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించడానికి అభ్యంతరాలు ఉండవచ్చునని, అప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించవచ్చునని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు తమకు అభ్యంతరాలున్నాయని, మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలిలో ఇద్దరు వైసీపీ ఎంపీలున్నారని ఆయన చెప్పారు. వైద్య పరీక్షల తర్వాత బెయిల్ పిటిషన్ మీద నిర్ణయం జరిగే వరకు రఘురామను హౌస్ అరెస్టులో ఉంచాలని రోహత్గి కోరారు. 

అయితే, రఘురామకు వైద్య పరీక్షలు చేయించడానికి మణిపాల్ ఆస్పత్రి ఉందని, అది విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని సిఐడి తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా విచారణకు హాజరయ్యారు. రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

కాగా, అంతకు ముందు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రుఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్ లతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ వాదనలు వినిపిస్తున్నారు. ఏపి ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపిస్తున్నారు. 

రఘురామకు బెయిల్ ఇవ్వడంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు. రఘురామను అరెస్టు చేసిన తీరును ఆయన సుప్రీంకోర్టుకు వినిపించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారుుల పట్టించుకోలేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. 

బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్ 124(ఏ) కిద కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అదనపు డిజీ స్వయంగా విచారణకు ఆదేశించారని, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెపపారు. గుంటూరు తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతోనే అక్కడ కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. 

కస్టడీలో రఘురామ కృష్ణమ రాజును కొట్టారని, అరికాళ్లకు తగిలిన దెబ్బలను రఘురామ మెజిస్ట్రేట్ కు చూపించారని ఆయన గుర్తు చేశారు. గత ఎడాది డిసెంబర్ లో రఘురామకృష్ణమ రాజుకు బైపాస్ సర్జరీ జరిగింది ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. రఘురామ కృష్ణమ రాజుకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆయన కోరారు. 

రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలనే రోహత్గీ వాదనలకు దుష్యంత్ దవే అభ్యంతరం తెలిపారు.  మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో జ్యుడిషియల్ అధికారి సమక్షంలో పరీక్షలు చేయిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్మీ ఆస్పత్రులున్నాయా అని జస్టిస్ శరన్ అడిగారు. సికింద్రాబాదులో ఉందని రఘురామ తరపు న్యాయవాది ఆదినారాయణ రావు చెప్పారు. అక్కడి నుంచే రఘురామను అరెస్టు చేసి గుంటూరు తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో నేవల్ బేస్ ఆస్పత్రి ఉందని, అది కూడా 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత విచారణను సుప్రీంకోర్టు బెంచ్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios