ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నేతలైనా రోజూ వ్యాఖ్యలు చేస్తారో చెయ్యరో కానీ.... సొంత పార్టీ నేత రఘురామకృష్ణమ రాజు మాత్రం జగన్ సర్కార్ పై ఏదో ఒక విమర్శ చేయని రోజంటూ లేదు అంటే అతిశయోక్తి కాదు. 

తాజాగా ఆయన కట్టప్ప అంటూ పేరు చెప్పకుండా, ముఖ్యమంత్రి సమీప బంధువు అంటూ వైసీపీలో కీలక నేతపై విమర్శలను గుప్పించారు. ఆవ భూముల కుంభకోణం గురించి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి బంధువుల హస్తం ఉందనుకుంటే ప్రధానికి ఫిర్యాదు చేస్తానని, ఇది విశృంఖల దోపిడీ అని ఆరోపించారు. 

ఆయన మంగళవారం నాడు ఢిల్లీలో రచ్చబండ పేరుతో ఒక కార్యక్రమంలో విలేఖరులతో మాట్లాడుతూ.... పేదలకు ఇండ్ల స్థలాల పేరుతో వందల కోట్ల దోపిడీ జరిగిందని ఆక్షేపించారు. 

ప్రస్తుత గోదావరి వరదల దెబ్బకు.... పేదలకు ఇస్తామన్న ఇండ్ల స్థలాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయని, ఈ భూములనా పేదలకు ఇండ్లు కట్టుకోమని ఇచ్చేది అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

రైతులు తమ భూములను ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలకు ఇస్తే... 20 నుంచి 25 లక్షల మధ్య రేటు మారిందని, ఈ సొమ్మంతా అవినీతిపరులపాలయ్యిందని రాజమండ్రి వాసులు చెబుతున్నారని రఘురామా ఆరోపించారు. 

వరద గోదావరిని మించిన అవినీతి ఘోష ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక విషయంలో అవినీతి తారాస్థాయికి చేరిందని... కేటాయింపుల నుండి మొదలు పంపకాల వరకు అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని రఘురామ అన్నారు.