ఏపీ పరువుకు నష్టం చేస్తున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడలకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్
టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చేసిన విమర్శలకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటరిచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందని ఆయన మండిపడ్డారు.
న్యూఢిల్లీ: తన వ్యాఖ్యలను Tdp వక్రీకరించిందని ycp ఎంపీ మార్గాని భరత్ చెప్పారు. శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.ఏపీలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని తాను వ్యాఖ్యానించినట్టుగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు.టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 4 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. ఎఫ్‌ఆర్ బీఎం పెంపు విషయమై తాను చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు వక్రీకరించాయని ఆయన విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదనే విధంగా టీడీపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. తాను మాట్లాడిన అంశానికి సంబంధించిన ఆడియోను ఎడిటింగ్ చేసి వక్రీకరించారని ఆయన ఆరోపించారు.మిగులు బడ్జెట్ మోడల్ అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో ఏం అభివృద్ది చేశారని ఆయన అడిగారు. ఐదేళ్లలో టీడీపీ హయంలో కట్టించిన నాలుగైదు భవనాలు కట్టిస్తే సరిపోతోందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ చేసిన అప్పులను తమ ప్రభుత్వం తీరుస్తుందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 4 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టిందని Margani Bharat ప్రశ్నించారు. బీజేపీతో మితృత్వం ఉన్న సమయంలో టీడీపీకి ఏపీ ప్రయోజనాలు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిన విషయం ఇవాళ టీడీపీకి గుర్తుకు వచ్చిందా అని ఆయన అడిగారు. గతంలోనే మంత్రులుగా ఉన్న అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు గంజాయి విషయమై చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా, విభజన తర్వాత చూసుకున్నా 63 ఏళ్లలో ఏపీకి రూ. 3.14 లక్షల కోట్లు అప్పు ఉంటే జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో అక్షరాలా రూ. 3.08 లక్షల కోట్లు అప్పు చేశారని కనకమేడల రవీంద్రకుమార్ వివరించారు. తాను చెప్పిన వివరాల్లో తప్పు ఉంటే ప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాను చెప్పినవన్నీ అధికార గణాంకాలేనని వెల్లడించారు.ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి గ్రామ పంచాయతీల నిధుల్ని డైవర్ట్ చేశారని ఎంపీ కనకమేడల విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి వచ్చే నిధుల్ని దారి మళ్లించారన్నారు. అప్పులన్నీ వైసీపీ ప్రభుత్వం చేసి చంద్రబాబుపైకి నెట్టడం దారుణమన్నారు.