విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన అనే పార్టీని ఎందుకు పెట్టారో తెలియని పరిస్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక వుడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే మీకేమిటి బాధ అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తూ గాజువాక నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడంతో ఉత్తరాంధ్రపై ద్వేషం పెంచుకున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ ప్రజలు ఛీదరించారని ఆ ప్రాంతం అభివృృద్ధి కాకుండా అడ్డుపుల్ల వేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోందని ఆయన అన్నారు. 

ప్రశ్నించడం కోసం అంటూ పార్టీ పెట్టి ఆరు నెలలకు ఒకసారి ఒక ప్రశ్న వేసి తర్వాత కనిపించని పవన్ కల్యాణ్ మూడు రాజధానులు ఎలా ఇస్తారని ప్రశ్నించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. 

టీడీపీతో ఐదేళ్ల పాటు కాపురం చేసిన పవన్ కల్యాణ్ కు అమరావతి అప్పుడు భ్రమరావతిగా కనిపించలేదా అని ప్రశ్నించారు నిజమైన రాజకీయ నాయకుడైతే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేయాలని ధర్మశ్రీ అన్నారు. భూస్థాపితమైన పార్టీల నాయకులు ఉనికి చాటుకోవడానికి పనికి రాని ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.