వైసీపీ రెండో లిస్ట్ విడుదల కాకముందే పార్టీ మార్పులు మొదలయ్యాయి. టికెట్ దక్కదని స్పష్టంగా తెలిసిన సిట్టింగులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు.
జగ్గంపేట : వైసీపీలో సిట్టింగుల మార్పు పంచాయతీ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుందో తెలియదు.. కానీ, ఇప్పటికైతే జంపింగ్ జపాంగులు ఎక్కువవుతున్నారు. రెండో లిస్టులో జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించనున్నట్లు పక్కా సమాచారం రావడంతో జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. జగ్గంపేట నుంచి మాజీ మంత్రి తోట నరసింహంకు వైసిపి ఈసారి టికెట్ ఇవ్వనున్నట్లుగా రెండో లిస్టు సమాచారం ప్రకారం తెలుస్తోంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ ఈ సమాచారాన్ని జ్యోతుల చంటిబాబుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారట. దీంతో నిరాశకు గురైన జ్యోతుల చంటిబాబు ఎలాగైనా తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. వైసిపి అధిష్టానం తనకు మొండి చేయి చూపించడంతో మరో పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మొదట టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.
వైసీపీ రెండో జాబితా అప్పుడే... ఎవరెవరికి టికెట్ దక్కనుందంటే...
కానీ, అక్కడ టిడిపి నేత జ్యోతుల నెహ్రూ చంటిబాబు చేరికపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించడంతో మరోసారి నిరాశే ఎదురయిందట. జ్యోతుల నెహ్రు తీవ్ర వ్యతిరేకత చూపించడంతో జ్యోతుల చంటిబాబు చేరికపై టిడిపి హోల్డ్ లో పెట్టింది. గతంలో జ్యోతుల చంటిబాబు టిడిపి నుంచి 2009, 2014 ఎన్నికల్లో బరిలోకి దిగిన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో పార్టీ మారి వైసిపిలో చేరారు. వైసీపీ టికెట్ మీద జగ్గంపేట నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ, ఈసారి వైసీపీ నుంచి టికెట్ దక్కదని స్పష్టం అవడంతో మరోసారి టిడిపి వైపు చూశారు.
కానీ అక్కడ కూడా టికెట్ దక్కే విషయం అనుమానంగానే ఉండడంతో… ఎలాగైనా ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరడానికి మంతనాలు సాగిస్తున్నారు. చివరగా జ్యోతుల చంటిబాబు జనసేనలోకి వెళ్లడానికి నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. జనసేన బిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుల సమక్షంలో పవన్ కళ్యాణ్ తో రహస్యంగా సమావేశమై గంటకు పైగా చర్చించినట్లుగా సమాచారం.
దీనిమీద జ్యోతుల చంటిబాబు మాట్లాడారు. పవన్ కల్యాణ్ పిలిస్తేనే వెళ్లి మాట్లాడానని చెప్పుకొచ్చారు. జిల్లా రాజకీయాలపై అడిగి తెలుసుకున్నారని తెలిపారు. కాగా, పార్టీ మార్పుపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల జాంటిబాబు సమాలోచన చేస్తున్నారు. జగ్గంపేటనుంచి తోట నరసింహంకు టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తోట నరసింహంకు సపోర్ట్ చేస్తానన్న చంటిబాబు పవన్ తో కలిశాక మాట మార్చారు.
వైసిపికి రాజీనామా చేసేందుకే చంటిబాబు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా టైం ఉండడంతో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అంటున్నారు.
మరోవైపు వైసీపీ.. అన్ని నియోజకవర్గాల్లో చేయించిన సర్వేల ఆధారంగా 100% గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి మరో కారణం తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో సిట్టింగుల మీద వ్యతిరేకత ఉన్నా మార్చకపోవడంతో.. బీఆర్ఎస్ ఓటమి కూడా అని అంటున్నారు. ఈ మార్పుల్లో భాగంగానే ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో సిట్టింగులను మార్చింది వైసీపీ. మరో 11 నియోజకవర్గాల్లో మార్చబోతోంది. ఈ రెండో లిస్టు 11 నియోజకవర్గాల్లో జగ్గంపేట కూడా ఉంది.