శింగనమలలో పద్మావతికి బదులు ఓ ఎస్పీకి సీటు కన్షర్మ్ అయినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మూడో లిస్టు వస్తేకానీ దీనిమీద క్లారిటీ రాదు.
అనంతపురం : సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫేస్బుక్లో ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అధికార పార్టీ.. తనను చాలా ఇబ్బందులకు గురి చేశారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకు అంటూ నిలదీశారు. తాను ఒక ఎస్సీ మహిళను కాబట్టే చిన్నచూపు చూస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. సింగనమల నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
ప్రతిసారి నీళ్లు తీసుకురావడానికి యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. సింగనమల నుంచి కాలువల ద్వారా కుప్పంకు నీళ్లు తీసుకు వెళుతుంటే చూస్తూ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సింగనమలకు నీరు రాకుండా కొంతమంది సీఎం దగ్గర పంచాయతీలు పెట్టే స్టేజికి వెళ్ళిందన్నారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా జిల్లా నేతలు, ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. కనీసం ఒక్క చెరువుకు కూడా నీరు విడుదల చేయాలని అడిగితే జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ మూడో జాబితాలో 30 మంది? ఈ సారి టార్గెట్ వారేనా?
ఈ మేరకు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు పద్మావతి. తనను ఎన్నుకొని ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గాల ప్రజలు అభివృద్ధికి అవకాశం ఇచ్చారని.. కానీ, వారికి ఇవ్వాల్సిన తాగునీరు, సాగునీటి కోసం పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. నియోజకవర్గానికి నీటిని సాధించడం కోసం ప్రజలందరూ తనకు మద్దతునియాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.
నీటి వాటా కోసం మాట్లాడితే పెద్ద నేరం, ఈ ఐదేళ్ల కాలంలో నన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు.. ఎస్సీ మహిళ అయితే మీ కాళ్లు పట్టుకోవాలా? ఎవరి ఈగోనో సాటిస్ఫై చేయడం కోసం ప్రయత్నించాలా? అందరికీందా అణిగిమణిగి ఉండాలా? అంటూ సోషల్ మీడియా లైవ్ లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ధ్వజమెత్తారు. జగనన్న చెప్పినట్లుగా గడపగడపకు కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించామని ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. 2014 -19 సమయంలో పనికి వచ్చిన క్యాస్ట్ ఈక్వేషన్ 2024లో పనికిరాదా..? ఆ కాస్ట్ ఈక్వేషన్లే ఇప్పుడు కూడా ఉంటాయి కదా? అని ప్రశ్నించారు.
తెరవెనుక ఏమైనా జరుగుతుందో తెలియదు..బస్సు యాత్ర చేసే టికెట్ ఇప్పిస్తానన్న మంత్రి పెద్దిరెడ్డి మాట తప్పారు, మాట నిలబెట్టుకోవాలి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. వైసీపీలో మార్పు చేర్పుల వ్యవహారంలో ఇదొక కొత్త మలుపుగా చెప్పవచ్చు. ఉమ్మడి అనంతపురంలో ఉన్న రెండు ఎంపీ స్థానాలు మూడు అసెంబ్లీ స్థానాలకు వైసీపీ అధిష్టానం మార్పులు, చేర్పులు చేసింది. ఇక్కడున్న మరో నాలుగు స్థానాల్లో కూడా మార్పులు జరగచ్చని సంకేతాలు ఉన్నాయి. అందులో సింగనమల, మడకశిర, రాయదుర్గం అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి.
ఈ స్థానాల్లో మార్పు కచ్చితంగా ఉంటుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వీడియో కలకలం రేపుతోంది. ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు సింగనమల ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాగా, శింగనమలలో పద్మావతికి బదులు ఓ డీఎస్పీ శ్రీనివాసమూర్తికి సీటు కన్షర్మ్ అయినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మూడో లిస్టు వస్తేకానీ దీనిమీద క్లారిటీ రాదు.
