ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. టీడీపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకీ మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల  చేసింది.. మరో జాబితాను కూడా త్వరలో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో.. మరో వైసీపీ ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వరస భేటీలో చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు.

శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబుని అమరావతిలో మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పా రెడ్డి కలిశారు. మదనపల్లి టికెట్ తనకు కేటాయిస్తే.. టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు దేశాయ్ తెలిపారు. అయితే.. అతని కోరిక విషయంలో  చంద్రబాబు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దేశాయ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా..  ఇటీవల టీడీపీలో చేరిన వంగవీటి రాధా కోసం టీడీపీ కొన్ని స్థానాలను రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. రాధా పోటీ ఖాయమైతే.. కొన్ని చోట్ల సమీకరణాలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.