టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ తీవ్ర విమర్శలు చేశారు.  చంద్రబాబుని రాష్ట్రం నుంచి  బహిష్కరించాలని ఆయన పేర్కొన్నారు.  విజయవాడ బెంజ్ సర్కిల్  వద్ద చంద్రబాబు డ్రామాలు చూసిన తర్వాత ఆయనకు జన్మలో ఇక బుద్ధి రాదని ప్రజలకు అర్థమైందన్నారు.

విజయవాడ బెంజి సర్కిల్ వద్ద రోడ్డుపై కూర్చొని చంద్రబాబు డ్రమాలు ఆడారని మండిపడ్డారు. చంద్రబాబు ఓ అసాంఘిక శక్తి అని... ప్రజల మధ్య సామరస్యాన్ని చెడగొడుతున్న వ్యక్తిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ  చంద్రబాబుకి తెలంగాణలో కూడా రావడానికి అనుమతి ఇవ్వకుండా ఉంటే... దేశం నుంచే బహిష్కరించాలన్నారు.

చంద్రబాబు హయాంలో జరిగిన అన్యాయాన్ని మాత్రమే జగన్ సరిదిద్దుతున్నారని అమర్‌నాథ్ అన్నారు. కాగా.. బుధవారం రాత్రి విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద చంద్రబాబునాయుడు ధర్నా చేశారు. జేఏసీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత చంద్రబాబునాయుడు, అఖిలపక్ష నేతలు పాదయాత్రగా వెళ్లే ప్రయత్నం చేశారు. అమరావతి జేఏసీ చేపట్టిన 13 జిల్లాల బస్సుయాత్రకు పోలీసులు బ్రేక్ వేయంతో.. వారి వైఖరిని నిరసిస్తూ పాదయాత్రగా బస్సులు సీజ్ చేసిన ప్రాంతానికి బయలుదేరారు. 

అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, చంద్రబాబు, అఖిలపక్ష నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం బెంజి సర్కిల్ వద్ద ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు అఖిలపక్షం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక వాహనంలో చంద్రబాబు నివాసానికి తరలించి, అక్కడ వదలిపెట్టారు.