గుంటూరు పట్టణంలో గతకొద్దిరోజులుగాా జిన్నా టవర్ విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం స్వయంగా హోంమంత్రి సుచరిత ఈ టవర్ వద్ద జాతీయ జెండా ఎగరేసి వివాదాలకు తెరదించే ప్రయత్నం చేసారు.

గుంటూరు: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (modugula venugopal reddy) పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా (mohammad ali jinnah) గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ మహానేత జిన్నా అని మాజీ ఎంపీ కొనియాడారు. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని జిన్నా కోరుకున్నారని అన్నారు. జిన్నాలో ముస్లింను చూడలేము... గాంధీలో హిందువును చూడలేమన్నారు. ముస్లింలు ఈ దేశంలో ద్వితీయ పౌరులు కాదు ప్రథమ పౌరులేనని మాజీ ఎంపీ పేర్కొన్నారు. చివర్లో జిన్నా అమర్ రహే అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మోదుగుల. 

గుంటూరు పట్టణ నడిబొడ్డున గల జిన్నా ట‌వ‌ర్ పై గత కొన్నిరోజులుగా నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అధికార పార్టీ పూనుకుంది. ఇటీవల రిపబ్లిక్ డే రోజులు ఈ టవర్ వద్ద జాతీయ జెండా ఎగరవేయడానికి హిందూవాహిని కార్యకర్తలు ప్రయత్నించగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి జిన్నా టవర్ విషయంలో వివాదం మొదలవగా స్వయంగా హోంమంత్రి మేకతోటి సుచరిత రంగంలోకి దిగారు. 

Video

బిజెపి ఆందోళనల నేపథ్యంలో గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్ (guntur jinnah tower) కు త్రివ‌ర్ణ ప‌తాకంలోని మూడు రంగులు వేసి ఆ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాదు రక్షణ చర్యలు చేపట్టారు. ఇవాళ స్వయంగా హోంమంత్రి సుచరిత గుంటూరు నాయకులతో కలిసి జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి వివాదానికి తెరదించే ప్రయత్నం చేసారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు గుంటూరు వైసిపి నాయకులు మహ్మద్ అలీ జిన్నాను కొనియాడుతూ మరో వివాదానికి తెరతీసారు. 

వైసిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ (dokka manikya varaprasad) మాట్లాడుతూ...మహ్మద్ అలీ జిన్నా భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారని గుర్తుచేసారు. ఆయనో గొప్ప న్యాయవాది అంటూ కొనియాడారు. భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారని... వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని ఎమ్మెల్సీ సూచించారు. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్ కు ఎమ్మెల్సీ డొక్కా ధన్యవాదాలు తెలిపారు. 

మరో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ... జిన్నా టవర్ వద్ద ఏ జరుగుతుందోనని దేశ యావత్తు చూస్తోందన్నారని... కానీ ఇక్కడ దేశ ఐకమత్వం వెల్లివిరిసిందన్నారు. బిజెపి నేతలు రాజకీయ స్వలాభం కోసం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారుని... కానీ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశామన్నారు. అన్ని మతాల ప్రజలందరూ కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారన్నారు. దేశ భక్తి గురించి బిజెపి నేతలా మాకు చెప్పేది.... సిగ్గుండాలి... గాడ్సేను కొలుస్తున్న మీ నుండి దేశ భక్తి నేర్చుకోవాలి అంటూ అప్పిరెడ్డి మండిపడ్డారు. 

ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ... భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ గొప్పతనమన్నారు. రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి వివాదాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఐకమత్వం అంటే ఏమిటో జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా నిరూపించామని ఎమ్మెల్యే గిరి పేర్కొన్నారు. 

మరో ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ... ఎలాంటి గొడవలు లేకుండా ముస్లింలు ముందుకొచ్చి జాతీయ జెండా ఎగుర వేసారని అన్నారు. గుంటూరులో జిన్నా టవర్ ఉందని తెలియజేసిన కొంతమందికి ధన్యవాదాలు అంటూ బిజెపి నాయకులను ఎద్దేవా చేసారు ఎమ్మెల్యే ముస్తఫా.