విజయవాడ: తెలుగుదేశం పార్టీ హయాంలో అనుమతులిచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం తిరిగి అనుమతులిచ్చి గొప్పలు పోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 25 ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతా ఉంటే ఆపేశారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్జం పేరుతో జరిగిన ధనయజ్జంతో ఇరిగేషన్ రంగం భ్రష్టుపట్టిపోతే టిడిపి అధికారంలోకి రాగానే రమారమి రూ.63,373 కోట్లు 5 ఏళ్ళలో ఖర్చు చేశామన్నారు. ఇలా చంద్రబాబు నాయకత్వంలో సమగ్ర జల విధానం తీసుకువచ్చామని మాజీ మంత్రి పేర్కొన్నారు. 

''కోస్తాంధ్ర పట్టిసీమ, పురుషోత్తమపట్నం పోలవరం ప్రాజెక్టులో  70శాతం, వెలుగొండ, సంఘం నెల్లూరు ప్రాజెక్టులు, హంద్రీనీవా కాలువలు వెడల్పు చేసి చరిత్ర సృష్టించాం. హంద్రీ నీవా కాలువ తీసుకువెళ్ళి కియా పరిశ్రమ నెలకొనేలా చేశాం. కుప్పం దాకా నీళ్ళను తీసుకు వెళ్ళాం.  805 అడుగుల వద్ద మచ్చుమర్రి లో నీళ్ళు లిఫ్ట్ చేసి హంద్రీనీవా, గాలేరి నగరి, పులివెందులకు నీళ్ళు ఇచ్చాం'' అని  తెలిపారు. 

''పోతిరెడ్డిపాడు ద్వారా 400 టీఎంసీల నుంచి 500 టీఎంసీల నీళ్ళను రాయలసీమకు తరలించాం. రౌతునుబట్టే గుర్రం పరుగెడుతుంది. బుల్లెట్ దింపే మంత్రి జిల్లాలో నీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇదే అధికార యంత్రాంగాన్ని తాము అయిదేళ్ళు పరుగెత్తించాం, ప్రాజెక్టులను పూర్తి చేయించాం'' అని తెలిపారు. 

''రాష్ట్రవ్యాప్తంగా కరోనా కష్టాల్లో ప్రజలు ఉన్నారు. రెడ్ జోన్ , గ్రీన్ జోన్  ఆరేంజ్ జోన్, కంటైన్మెంట్ జీన్ లు ఉంటే  రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్  మిషన్ మొదలుపెట్టింది. ప్రభుత్వ భూముల అమ్మకాలకు మొదలుపెట్టింది. ఎంత దుర్మార్గచర్య. రాష్ట్ర ఖజానాలో రూ.13వేల కోట్ల డబ్బు ఉంది. రూ.20 వేల కోట్లు జీఎస్టీ కింద, కరోనా కట్టడికి కేంద్రం రూ.20 వేల కోట్లు అందించింది. ఇవాళ రూ.200కోట్ల డబ్బులకోసం 9 స్థలాలను (విశాఖలో ఆరు,గుంటూరులో మూడు) అమ్మకానికి పెట్టారు'' అని ఆరోపించారు.

''రాష్ట్రానికి గుండెకాయవంటి  గుంటూరు నడిబొడ్డులో ఎకరం డెబ్బైరెండు సెంట్ల స్థలం అమ్మకానికి పెట్టిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. గుంటూరు కార్పోరేషన్, కార్మికశాఖకు సంబంధించిన భూములు నల్లపాడులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములను వేలానికి పెట్టింది. ప్రభుత్వం దివాళా తీసిందా? ఐపీ పెట్టే ఆలోచనలో ఉందా?'' అని ప్రశ్నించారు. 

''విశాఖలో కొండపై ఫ్రంట్లైన్ వారియర్స్ గా ప్రాణాలకు తెగించి కష్టపడి పని చేసున్న  రిజర్వ్ పోలీసులకు సంబంధించిన విశాలాక్షి నగర్, చినగల్లి బీచ్ ఏరియాలో గజం 30-35 వేలలోపే నిర్ణయించారు. అక్కడ వాస్తవానికి రూ75 వేల నుంచి రూ.1లక్ష వరకూ ధర ఉంది. ఎకరం ఉన్న ఈ భూమిలో స్టార్ హోటల్ నిర్మిస్తే అన్ని గదుల్లోనూ సముద్రం వ్యూ కనపడుతుంది. అటువంటి స్థలాన్ని సగం రేటుకే ఎందుకు పెట్టారు. దానిపక్కనే 75 సెంట్లభూమిని కూడా 14.47 కోట్ల ధర నిర్ణయించారు. అది 30కోట్లపైన ఎప్పుడైనా అమ్మకానికి వస్తుంది. చినగల్లిలో ఎకరం 16.64.కోట్లు పెట్టారు అది 32కోట్లు విలువుంటుంది'' అని వివరించారు. 

''కరోనా కష్టకాలంలో ఇంత హడావుడీగా ప్రభుత్వ భూములను వేలం ద్వారా అమ్మకానికి పెట్టారు. కారణం ఏమిటి? ప్రజలకు రక్షన కల్పించే పోలీసుల భూమిని కొట్టేసి స్టార్ హోటల్ కట్టేందుకు ఎందుకు అమ్మాల్సి వచ్చింది. 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సెస్సు డబ్బులే ఇవ్వడం లేదు. రాష్ట్ర ఖజానాలో వందలకోట్ల డబ్బులుంటే కేంద్రం కార్మికులకు ఇవ్వమని చెప్పింది. పేద కార్మికులకు సంబంధించిన భూములు అమ్మకానికి పెట్టడానికి కారణమేమిటి?'' అని ప్రశ్నించారు. 

''విశాఖలో 11నెలలుగా విజయసాయిరెడ్డి, మిగిలిన అనుయాయులు వేలాది ఎకరాలు కొన్నందున ఆ భూములకు విలువ పెరగడానికి ధర పెంచి చూపారు. చినగళ్ళిలో భూముల ధరలు తక్కువ ధర పెట్టి కొట్టేసే కార్యక్రమానికి తెరదీశారు. ఈ మతలబు దోపిడీ కార్యక్రమం ఏమిటి? ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ పై ఉంది. సీఎం అనుచరులు బే పార్క్ చూసివెళ్ళారు. బ్యాంకుల.వద్ద తీసుకున్న రుణాలను బేపార్కు కట్టలేని స్థితిలో ఉందని స్థానికులు గగ్గోలుపెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు పెద్దెత్తున చేతులు మారబోడానికి కారణం ఏమిటి?'' అని అడిగారు. 

''మార్చి ఆఖరు వరకూ 1.70 లక్షల కోట్లు దేనికి ఖర్చు చేశారు. మళ్ళీ ఇప్పుడు విశాఖలో భూదోపిడీకి పాల్పడుతున్నారు. బడ్జెట్ లెక్కలను ఇప్పటి వరకూ సీఎం, ఆర్థిక మంత్రులెవరూ ప్రజలకు చెప్పలేదు. బుగ్గన కాకి లెక్కలు చెబుతూ బడ్జెట్ అంశాలను కాగ్ కు పంపామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చులో తప్పొప్పులు చెప్పే కాగ్ బడ్జెట్ విషయాలను ఎలా చెబుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో చాలా దొంగలెక్కలకు ఆస్కారం కల్పించారు. సీఎం సీఎఫ్ఎంఎస్ లో లెక్కలను బహిర్గతం చేయాలి'' అని అడిగారు. 

''గతంలో చంద్రబాబు  ఆన్ లైన్ లో ప్రతి ఏటా సీఎఫ్ ఎంఎస్ లో ఏ బిల్లు ఎవరికి చెల్లించారో స్పష్టంగా తెలుసేలా చేశారు. కానీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వం దానిని ఎందుకు బ్లాక్ చేశారు. చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే దమ్ముంటే, ధైర్యముంటే సీఎఫ్ ఎంఎస్ లో ఉండే డేటా అంతా11నెలల్లో ఎవరెవరికి బిల్లులిచ్చారో తేటతెల్లం చేయాలి. ఆర్థికశాఖలో ఏం జరుగుతోందో చెప్పేపరిస్థితిలో ఒక్క అధికారి లేరు. ఆర్థిక.శాఖలో ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తి  ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో చిత్తూరు, కర్నూలు జిల్లా మంత్రులు, అజయ్ కల్లంరెడ్డి, ధనంజయరెడ్డి సారధ్యంలో  బిల్లులు మంజూరు చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

'' రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి అవగాహన లేకుండా అంతా కాగ్ లెక్కలు చెబుతుందని చేతులేత్తేశాడు. గవర్నరు ద్వారా ఆర్డినెన్స్ తెచ్చి రూ.70 వేల కోట్లు తెచ్చి దేనికెంత ఖర్చు చేశారు. జీతాలు, ఎస్టాబ్లిష్మెంట్ లకు ఎంతెంత ఖర్చు చేశారు. గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు 50% మినహాయించారు. హైకోర్టులో మొట్టికాయలు పడితే పింఛనుదార్లకు  పూర్తి పింఛన్లు చెల్లించారు. పేదలకు ఇంటికో పించను మాత్రమే ఉంచి రెండోదానికి తొలగించమని ఆదేశించారు'' అని అన్నారు.  

''వాలంటీర్లు ఇళ్ళళ్ళకూ తిరుగుతూ ఇంటికో పించను మాత్రమే వస్తుందని చెబుతున్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పోరేషన్లకు ఎంత ఖర్చుపెట్టారు. ఇష్టారాజ్యంగా రెండు నెలల బిల్లులు కలిపి యూనిట్ కు రూ. 9  చొప్పున వేయి వచ్చే బిల్లు 4వేలుకుపైగా వేసి పంపుతున్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో పేదలు సంపాదించుకునే రూ.300ల్లో 200 చీప్ లిక్కరుకే తగలబెడుతున్నారు. దొంగలదోపిడీగా ప్రభుత్వం వ్యవహారం ఉంది. లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెర్చిఉన్న ప్రాంతంలో నిల్వలను నాలుగింతలకు వైకాపా శాసనసభ్యులు.కార్యకర్తలను పెట్టి అమ్ముకున్నారు. విచారణకు వచ్చిన అధికార్లకు.మద్యం ఎలుకలు తాగేశాయని అబద్దాలు అల్లి చెప్పారు. మద్యం దుకాణాల్లో స్టాకుకు లెక్కలు తేడా వస్తున్నాయి. మద్యం అమ్మకాల్లో చాలా అరాచకాలు జరుగుతున్నాయి'' అని ఆరోపించారు. 

''50 లక్షల టన్నులు ఇసుకను గోదావరి, కృష్ణ, పెన్నా, అన్ని వాగుల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించకుండా వేలాది లారీలతో తరలించి గుట్టలుగా పోశారు. విచ్చలవిడిగా ధర నిర్ణయించడంతో లారీ ఇసుక రూ.30 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముకుంటున్నారు. దాదాపు రూ. 20వేల కోట్ల ఇసుక కుంభకోణం దాగి ఉంది. లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత నిల్వ చేసిన ఇసుకను హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైకి తరలించడానికి సిద్ధంగా ఉన్నారు'' అంటూ వైసిపి ప్రభుత్వం, నాయకులపై దేవినేని ఉమ మండిపడ్డారు.