తాగిన మైకంలో అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన యువకులను వైసిపి కౌన్సిలర్ దాడికి దిగిన ఘటన నూజివీడులో చోటుచేసుకుంది. 

ఏలూరు : అధికార వైసిపి కౌన్సిలర్ తమను విచక్షణారహితంగా చితకబాదాడంటూ కొందరు యువకులు ఆందోళనకు దిగడంలో అర్ధరాత్రి నూజివీడులో అలజడి రేగింది. తమపై దాడిచేసిన కౌన్సిలర్ పై కనీసం పిర్యాదు కూడా తీసుకోవడం లేదంటూ యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుంది. 

యువకులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన కొందరు యువకులు మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చారు. వీరు మద్యం మత్తులో గాంధీనగర్ వద్ద రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. ఇదే సమయంలో అటువైపు వచ్చిన అధికార వైసిపికి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ నడికుదురు గిరీష్ కుమార్ తో వీరు గొడవకు దిగారు. దీంతో కౌన్సిలర్ తో పాటు అతడి అనుచరులు యువకులను కర్రలు, ఇనుపరాడ్లతో రోడ్డుపైనే చితకబాదారు. 

వీడియో

ఈ దాడిలో గాయపడిన యువకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ కౌన్సిలర్ పై చర్యలు తీసుకునేందుకు భయపడిపోయిన పోలీసులు కనీసం పిర్యాదు కూడా తీసుకోలేదని యువకులు చెబుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దే గాయపడిన యువకులు ఆందోళనకు దిగడంతో అలజడి రేగింది. 

అయితే పోలీసులు ఆందోళనకు దిగిన యువకులను చెదరగొట్టి గాయాలపాలైన యువకులను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు యువకులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వివాదాన్ని ఎలాంటి పోలీస్ కేసులు లేకుండా ఇరువర్గాలను నచ్చజెప్పేందుకు కొందరు రాజకీయ నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం.