చంద్రబాబు పుట్టినరోజు వివాదం...కృష్ణా జిల్లాలో టిడిపి, వైసిపి వర్గీయులు ఘర్షణ
టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన సేవాకార్యక్రమం టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యింది.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన సేవా కార్యక్రమం వివాదానికి దారితీసిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నిన్న(సోమవారం) చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని నందిగామ టిడిపి నాయకులు నిరుపేదలకు నిత్యావసరాలను అందించారు. ఇదే ఇవాళ టిడిపి, వైసిపి వర్గాల మధ్య వివాదానికి కారణమయ్యింది.
కంచికచర్ల మండలం కునికినపాడు గ్రామంలో సోమవారం టిడిపి వర్గీయులు ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అయితే మంగళవారం ఇదే గ్రామంలో వైసిపి నాయకులు నిత్యావసరాల పంపిణీకి పూనుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య దూషణలు ప్రారంభమై మాటామటా పెరిగి ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది.
ఇరు వర్గాల మధ్య ఘర్షణలో పదిమంది తీవ్రంగా గాయపడగా మరికొందరికి స్వల్ఫ గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేయడం విషయమై ఘర్షణ చెలరేగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.