గుంటూరు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ఎస్ఈసీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు పంపిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టారు.  

''అందరూ వైసీపీ నేతల మాదిరిగా ఉంటారని విజయసాయిరెడ్డి అనుకుంటున్నారు. ఆడిటర్ గా దొంగలెక్కలు రాయడం, సూట్ కేసు కంపెనీలను సృష్టించడం, హవాలా మార్గంలో డబ్బులు తరలించడం విజయసాయికే  చెల్లిందని... ఏ2 ముద్దాయిగా ఉన్న వ్యక్తి, నేరచరిత్ర కలిగిన వ్యక్తి ఎదుటివారు కూడా ఆ విధంగానే ఉంటారని అనుకోవడం దురదృష్టకరమని'' అన్నారు.     

''కేంద్ర హోంశాఖకు తానే లేఖ రాశానని రమేష్ కుమార్ స్వయంగా చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, మభ్యపెట్టడానికి, కులం రంగు పూయడానికి, టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. అది వికటించింది. ఎన్నిరోజులు ప్రజలను మభ్యపెడతారు. వైసీపీ నేతల నిజస్వరూపం బట్టబయలైంది'' అని అన్నారు. 

''ఏపీలో 11జిల్లాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. అయినప్పటికీ జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పరీక్షలు సరిగా చేయడం లేదు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా చెన్నై నుంచి కనగరాజ్ ను పిలిపించి ఎస్ఈసీగా నియమించారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. స్థానిక సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''ప్రజలు జగన్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కరోనా పాజిటివ్ కేసులను దాస్తున్నారు. ఏవిధమైన లెక్కలు చెప్పడం లేదు. బాధితులకు సాయం కూడా అందించడం లేదు. ఆంగ్లమాద్యమంపై ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఇది జగన్ కు చెంపపెట్టు. రాజధానిని తరలించాలని చూస్తున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కరోనాను కూడా లెక్కచేయకుండా వైసీపీ నేతలు మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు?'' అని ప్రశ్నించారు. 

''పల్నాడులో వైసీపీ కార్యకర్తలు లారీలకు లారీలు తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. అక్రమ మైనింగ్ రాత్రింబవళ్లు జరుగుతోంది. జగన్, వైసీపీ మంత్రుల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ముస్లీం సమాజంపై వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారు.  దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. ప్రజల ప్రాణాల రక్షణ పట్ల ఏమాత్రం బాధ్యత లేదు''  అని ఆరోపించారు.

''ఏపీలో రిటైర్డ్ ఐఏఎస్ లు, జడ్జిలు లేరా? తమిళనాడు నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది. కులాలు, మతాల గురించి గతంలో ఏ ముఖ్యమంత్రీ మాట్లాడలేదు? వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సమయం కోసం వేచి చూస్తున్నారు.  విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు జగన్ తన అధికారాన్ని ఉపయోగించుకోవాలి'' అని అన్నారు. 

''ఏడాది గడచినా ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం లేదు. కేంద్రం ఇచ్చిన రూ.వెయ్యి సాయం కూడా సక్రమంగా అందలేదు. కుటుంబానికి రూ.5వేల సాయం అందించాలి. కరోనా తీవ్రత నేపథ్యంలో అఖిలపక్షాన్ని పిలవాలి. ప్రధాని అందరితో మాట్లాడుతుంటే.. జగన్ మాత్రం అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. కోర్టులు రోజూ అక్షింతలు వేస్తుండటం జగన్ పాలనకు నిదర్శనం. తెలుగుదేశం నీతివంతమైన పాలన అందించింది'' అని యరపతినేని వెల్లడించారు.