సీఎం జగన్ చేతగానితనంతో రాష్ట్రం దివాలా తీసిందని టీడీపీ సీనియర్ నాయకుడు, శాసన మండలి ప్రధాన  ప్రతిపక్ష నేత  యనమల రామకృష్ణుడు అన్నారు.  

రాష్ట్రం రాబడులు పెంచడంలో, రెవిన్యూ వ్యయంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని, టిడిపి పాలనలో మొత్తం బడ్జెట్ వ్యయం 11.6% పెంచామని (రూ 1.46లక్షల కోట్ల నుంచి రూ 1.63లక్షల కోట్లకు పెరిగింది) అదే వైసిపి ఏడాది పాలనలో కేవలం 1.80% (రూ 1.63లక్షల కోట్ల నుంచి రూ 1.66లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది) మాత్రమే పెంచారని ఆయన ధ్వజమెత్తారు. 

మొత్తంగా టిడిపి హయాంలో పూర్తి బడ్జెట్ వ్యయం ఏడాదికి రూ 17వేల కోట్లు పెరిగితే, వైసిపి పాలనలో కేవలం రూ 3వేల కోట్లు మాత్రమే పెరిగిందని, టిడిపి హయాంలో మొత్తం రెవిన్యూ రిసిప్ట్స్ 11.6% పెరగగా వైసిపి ఏడాది పాలనలో కేవలం 1.8%మాత్రమే పెరిగాయని ఆయన ఎద్దేవా చేసారు. 

అప్పుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి రికార్డులు సృష్టిస్తున్నారన్నారు. టిడిపి పాలనలో బారోయింగ్స్ 30.70% పెంచితే, వైసిపి ఏడాది పాలనలో  135% పెంచేశారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని ఆయన దుయ్యబట్టారు. 

 రెవిన్యూ వ్యయం టిడిపి హయాంలో 40% (రూ1. 21లక్షలకోట్ల నుంచి రూ1.26లక్షల కోట్లకు పెంచాం) పెరిగిందని, అదే వైసిపి ఈ ఏడాది పాలనలో రెవిన్యూ వ్యయం 42% పెంచారాణి అన్నారు. పెద్దఎత్తున వాలంటీర్లను, సచివాలయ సిబ్బందికి ప్రజాధనం దోచిపెట్టడం వల్లే రెవిన్యూ వ్యయం పెరిగింది తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల సంక్షేమానికి చేసిందేమీ లేదని, పైగా వారి జీతాల్లో కోతలు విధించారని దుయ్యబట్టారు.

 కేపిటల్ ఎక్స్ పెండిచర్ టిడిపి 53%పెంచితే, వైసిపి 50% కోత పెట్టిందని, మూలధన వ్యయం పడిపోవడమే అభివృద్ది నిర్వీర్యం కావడానికి నిదర్శనమని ధ్వజమెత్తారు యనమల. సంపద సృష్టికి జరిగిన కృషి శూన్యం. అనుత్పాదక వ్యయం చేశారే తప్ప ఉత్పాదక వ్యయం పూజ్యం. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులకు వేలకోట్లు దుర్వినియోగం చేశారని, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ముసుగులో వైసిపి కార్యకర్తల జీతాలకు ఏడాదికి రూ 4వేల కోట్ల దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ మొత్తంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరో 10% పూర్తయ్యేదని వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. 

సాగునీటి ప్రాజెక్టులకు టిడిపి ప్రభుత్వం కన్నా బడ్జెట్ తక్కువ కేటాయించారని, కేటాయించిన రూ 16,128కోట్లలో రూ3,566కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. పోలవరంపై టిడిపి ప్రభుత్వం అడ్వాన్స్ గా ఖర్చుపెట్టిన మొత్తం రూ3వేల కోట్లలో కేంద్రం రీయింబర్స్ చేసిన రూ 1,850 కోట్లను పోలవరం పనులపై ఖర్చుచేయకుండా వేరే పథకాలకు మళ్లించారని ఆక్షేపించారు. 

రెవిన్యూ లోటును రూ 41వేల కోట్లనుంచి రూ70వేల కోట్లకు పెంచారని, కరోనా ప్రభావం గత ఆర్ధిక సంవత్సరంలో  చివరి 9రోజులు మాత్రమే ఉందని, లాక్ డౌన్  వల్ల రాబడి తగ్గిందని కరోనాపై నెపం మోపడానికి కూడా వీల్లేని పరిస్థితి అని ఎద్దేవా చేసారు. 

ఏదైనా కరోనా ప్రభావం ఉంటే అది వచ్చే ఆర్ధిక సంవత్సరంపైనే తప్ప గడిచిన ఏడాదిపై కాదని స్పష్టం చేసారు.  ఏడాదిలో టిడిపి కంటె మూడున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసారని, ఏడాదికి టిడిపి ప్రభుత్వం సగటున రూ 24వేల కోట్లు అప్పులు చేస్తే, వైసిపి ప్రభుత్వం ఏడాదిలోనే రూ87వేల కోట్ల అప్పులు చేసిందని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. 

టిడిపి కంటె మూడున్నర రెట్లు ఎక్కువగా అప్పులు చేసిన వైసిపికి, టిడిపిని విమర్శించే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. తన చేతగానితనంతో సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, చివరికి భూములు అమ్మే దుస్థితికి దిగజార్చారని నిట్టూర్చారు. 

రాష్ట్రం దివాలా తీసిందా అని హైకోర్టు ప్రశ్నించడమే ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థానికి, వైసిపి చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. వైసిపి ఏడాది పాలనలో మద్దతు ధర లభించక రాష్ట్రంలో రైతులు  రూ 15వేల కోట్లు కోల్పోయారని,  రైతు భరోసా ముసుగులో చేసిన మోసంలో రూ 20వేల కోట్లు నష్ట పోయారని ఆరోపణలను గుప్పించారు. 

టిడిపి ప్రభుత్వం వస్తే ఒక్కో రైతుకు రూ లక్షా 10వేలు వచ్చేది, వైసిపి రావడం వల్ల ప్రతి రైతు రూ 75వేలు కోల్పోయారని, అంటే రైతాంగానికి రూ 35వేల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ధాన్యం క్వింటాల్ కు రూ 600 నష్టానికి అమ్ముకున్నారని,  అంటే టన్నుకు రూ 6వేల నష్టం వాటిల్లిందని వాపోయారు. 

ధాన్యం దిగుబడి 55లక్షల టన్నులు. అంటే ధాన్యం రైతులకే రూ 3,300కోట్లు నష్టం వాటిల్లిందని, మొక్కజొన్న క్వింటాల్ కు  రూ 400, మొక్కజొన్న దిగుబడి 14.5లక్షల టన్నులు. అంటే మొక్కజొన్న రైతులు రూ 58కోట్లను కోల్పోయారని అన్నారు. 

 వేరుశనగ రూ 590 నష్టానికి అమ్ముకున్నారని, మినుములు రూ700 నష్టానికి అమ్ముకున్నారని, తెల్లజొన్న క్వింటాకు రూ 800నష్టం, మిర్చి టన్నుకు రూ 14వేలు నష్టం, క్వింటాల్ ఉల్లికి రూ1000నష్టం, టమాటా క్వింటాకు రూ 10వేల నష్టం,

అరటి టన్నుకు రూ 12వేలు, బొప్పాయి టన్నుకు రూ 11వేలు, బత్తాయి టన్నుకు రూ 32వేలు, బంగినపల్లి మామిడి టన్నుకు రూ 30వేలు, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పుచ్చ పంటను 30%-50% నష్టాలకు రైతులు అమ్ముకున్నారని, అరటి, పుచ్చ రైతులు ఎకరానికి రూ 70వేల నుంచి రూ లక్ష నష్టపోయారని దుయ్యబట్టారు యనమల. 

ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారని, 100కౌంట్ రొయ్యలు కిలోకు రూ110నష్టం వాటిల్లగా, 40కౌంట్ రొయ్యలకు రూ 160 వాటిల్లిందని, కొనేవారు లేక రొయ్యలను ఎండబెడుతున్నారని వాపోయారు. సెరికల్చర్ రైతులు రూ 50వేల నుంచి రూ లక్షన్నర వరకు నష్ట పోయారని, ఏడాదిలోనే వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీశారని ధ్వజమెత్తారు.  

ఏడాదిగా ఆదాయం నిల్ - అభివృద్ది నిల్:

ఆదాయమే లేకుండా చేసినప్పుడు రాష్ట్రంలో అభివృద్దికి అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు యనమల. ఏడాది పాలనలో ఆదాయం నిల్, అభివృద్ది నిల్. ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ డెఫిసిట్ పెంచేశారని, వడ్డీల భారం పెంచారు, భవిష్యత్ చెల్లింపులు పెంచేశారని ఆక్షేపించారు. 

గ్రాస్ ఫిస్కల్ కేపిటల్ ఫార్మేషన్ ను నిర్లక్ష్యం చేశారని, మొత్తంగా ఆదాయాలు లేవు, పెట్టుబడులు లేవు, ప్రభుత్వ ఆదాయం లేకుండా చేశారు కాబట్టి ప్రభుత్వ పెట్టుబడులు పడకేశాయని అన్నారు యనమల. ప్రైవేటు పెట్టుబడులను బెదిరించి తరిమేశారని, పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి వెనక్కి తరలిపోయాయని, మూలధన అభివృద్దిని నిర్లక్ష్యం చేశారన్నారు. 

పెండింగ్ పారిశ్రామిక రాయితీలు తామే చెల్లించినట్లు సీఎం జగన్ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు యనమల. గత ప్రభుత్వాల పెండింగ్ బకాయిలు, అప్పులపై వడ్డీల చెల్లింపులు కొత్తకాదని, పాలన జగన్ కు కొత్త కాబట్టి ఇదంతా కొత్తగా అనిపించి వింత చేష్టలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేసారు. 

గత ప్రభుత్వ  హయాంలో 28,083పరిశ్రమలకు సంబంధించిన రూ 3,675కోట్లురాయితీలను టిడిపి ప్రభుత్వం చెల్లించిందని వైసిపి ప్రభుత్వం 2019జులైలో విడుదల చేసిన శ్వేతపత్రంలోనే పేర్కొందని, టిడిపి ప్రభుత్వ పెండింగ్ బకాయిలు రూ 4వేల కోట్లు తాము చెల్లించామని జగన్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. 

మసిబూసి మారేడు కాయ చేయడంలో జగన్ సిద్దహస్తుడని, పాలన చేతగాక పిల్లిగింతలు వేస్తున్నారని, కరోనా కష్టాల్లో ప్రజలు ఉంటే కోతిమూకతో కుప్పిగంతులు వేశారని, వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, వైసిపి నిర్వాకాలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు యనమల రామకృష్ణుడు.