అమరావతి: ఏపీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రభుత్వంలోని కీలక మంత్రుల మధ్య వివాదం ముదిరింది.  ఆర్థిక శాఖపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యలు చేయడంపై యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం నియమించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా  పలువురు ప్రభుత్వపెద్దలు వ్యతిరేకిస్తున్నారు. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్రమణ్యం‌ను సీఎస్‌గా ఎలా నియమిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో సీఎస్ సుబ్రమణ్యం కూడ  కొన్ని విషయాలపై  చేసిన వ్యాఖ్యలు వివాదం  ముదిరిపోతోంది. ఆర్థిక శాఖ పోకడలపై సీఎస్ ఎల్పీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేబినెట్ నిర్ణయాలను  ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేదని యనమల రామకృష్ణుడు చెప్పారు.  నిధుల సమీకరణ, విడుదలలో కేబినెట్ నిర్ణయమే ఫైనల్‌ అని యనమల గుర్తు చేశారు.

కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేదని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. అప్పులపై వడ్డీ రేట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని యనమల స్పష్టం చేశారు.

సర్వీస్ రూల్స్‌కు విరుద్దంగా సీఎస్ వ్యవహరిస్తున్నాడని  యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సెలవుపై వెళ్లడంపై కూడ ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే సీఎం సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు కూడ పంపారు.ఈ పరిణామాలను సీఎం సహా ప్రభుత్వ పెద్దలు తప్పుబడుతున్నారు.