గుంటూరు:  కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచమే ఆందోళనలో వుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ఇవేవీ పట్టవన్నట్లు రాజకీయాలే చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ  యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో వుండగానే ఎస్ఈసీని తొలగించడాన్ని యనమల తప్పుబట్టాడు. 

''ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ‘‘సీజ్’’ అంటే ‘‘మధ్యలో నిలిపేయడం’’.  దీనినిబట్టే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పదవీకాలం ఏవిధంగా సీజ్ చేశారో, డిస్కంటిన్యూ చేశారో గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ 5/2020 ను బట్టే తెలుస్తోంది. ఒకసారి నియామకం తర్వాత ఆయనకు ప్రతికూలంగా, పదవీకాలంలో మార్పు ఉండదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కె) స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా నిర్దేశించిన న్యాయ సేవల ప్రకారం, ‘‘పదవీకాలం’’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం కూడా వివరంగా తెలిపారు'' అని పేర్కొన్నారు. 

''ఈ కేసులో లక్నో హైకోర్టు తీర్పు వర్తించదు. అక్కడ ఒక ప్రభుత్వం పదవీకాలాన్ని 5ఏళ్లనుంచి 7ఏళ్లకు పొడిగిస్తే, తర్వాత వచ్చిన మరో ప్రభుత్వం 7ఏళ్లనుంచి 5ఏళ్లకు కుదించింది. నాకు తెలిసినంతవరకు ఆ కేసు ‘‘ఉద్యోగ సేవల పొడిగింపు’’ అంశమే తప్ప కుదింపు అంశం కాదు. అంతేకాకుండా, అది ‘‘ఎన్నికల మధ్యలో మార్చిన’’ సందర్భం కాదు. కానీ ఇక్కడ సందర్భం అందుకు పూర్తి భిన్నమైనది'' అని అన్నారు. 

''కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం ఇది. గవర్నర్ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్(5/2020) నిస్సందేహంగా రాజ్యాంగ ఉల్లంఘనే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆర్టికల్ 213కింద ఆర్డినెన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినప్పుడు, అప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాకే ఆర్డినెన్స్ ఇచ్చేవిషయంపై గవర్నర్ సంతృప్తి చెందాలి'' అన్నారు.

''ఇప్పుడున్న కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో,  రాజ్యాంగ ఉల్లంఘన ద్వారా ఎస్ ఈసి పదవీ కాలం కుదింపుపై, ఇంత అత్యవసర నిర్ణయం సరికాదు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మోసగించడమే..రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడవడమే, రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను కాలరాయడమే. కాబట్టి ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఒక్కరూ గర్హించాలి'' అని అన్నారు.

''వైసిపి ప్రభుత్వ ఒంటెత్తు పోకడలకు కళ్లెం వేయాలి. ఒక వ్యవస్థను ధ్వంసం చేయాలని చూస్తే, ఆ దుందుడుకు చర్యలను మరో వ్యవస్థ అడ్డుకోవాలనే సదుద్దేశంతోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థను 4ఎస్టేట్స్ గా రూపొందించారు. దేశంలో వ్యవస్థలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. రాజ్యాంగాన్ని పరిరక్షణ ప్రతిఒక్కరి పౌరధర్మం'' అని 
యనమల రామకృష్ణుడు అన్నారు.