అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. ప్రజావేదికను కూల్చివేస్తామంటూ సీఎం జగన్ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజావేదికను కూల్చడం తుగ్లక్ చర్య అంటూ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక అన్ని వర్గాల ప్రజల వేదిక అని చెప్పుకొచ్చారు. కొత్తభవనాలు నిర్మించకుండా ఉన్నవి కూల్చడం సరికాదంటూ హితవు పలికారు యనమల.  

లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా అభిృద్ధిబాటపట్టించాలా అన్న అంశాలపై ఆలోచించడం మానేసి విధ్వంసంపై వైయస్ జగన్ దృష్టిపెట్టడం దురదృష్టకరమన్నారు. మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు సమాధానం చెప్పాల్సి వస్తోందని ప్రజావేదికను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 

ప్రజావేదికను కూల్చేస్తామంటున్న వైయస్ జగన్ మరి సచివాలయంలోని భవనాలను కూడా కూల్చి వేస్తారా అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును 70శాతం పూర్తి చేశామని దాన్ని కూడా కూల్చివేస్తారా అంటూ సీఎం జగన్ ను మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.