ఆర్టికల్ 256, 257 ప్రకారమే... ఏపి పాలనలో కేంద్ర జోక్యం: యనమల రామకృష్ణుడు
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
గుంటూరు: కరోనాను నియంత్రించడం, ఆపత్కాలంలో సక్రమంగా విధులు నిర్వహించడంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మాజీ మంత్రి, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఇదే సరైన సమయమని అన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 256,257కింద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరైన మార్గదర్శకం చేయాలని యనమల సూచించారు.
''రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది. వైసిపి ప్రభుత్వ నిర్వాకాల వల్ల వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం అవుతోంది. రోడ్లపైనే ఉంటున్న వేలాది వలస కార్మికులను కేంద్రమే సంరక్షించాలి'' అని కోరారు.
''వైసిపి నాయకులు రాజ్యాంగ నిబంధనలను కాలరాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను, ఆదేశాలను రాష్ట్రం బేఖాతరు చేస్తోంది. వైరస్ నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారు. రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ రాష్ట్రాన్ని పోలీస్ రాజ్ గా చేశారు, శాంతి భద్రతలకు విఘాతం కల్పించారు'' అని ఆరోపించారు.
''ఏపి పంచాయితీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 200లో పేర్కొన్న అంశాలను ఉల్లంఘించారు. రాష్ట్రపతి నుంచి ఆమోదం లేకుండా రాజధాని అమరావతి తరలింపును ప్రతిపాదించి, ఏపి పునర్వవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించారు. 5ఏళ్ల పదవీకాలం మధ్యలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ను తొలగించడం, అదికూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సగంలో ఉండగా చేయడం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం మరియు ఆర్టికల్ 243(కె)ను ఉల్లంఘించడమే'' అని యనమల పేర్కొన్నారు.
''ప్రజారోగ్యం పరిరక్షణలో సీఎం జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారు. కానీ తన అనుచరుల అక్రమ లావాదేవీలను మరింత ప్రోత్సహిస్తూ అవి నిర్విఘ్నంగా కొనసాగేలా ప్రోత్సహిస్తున్నారు. కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలైన ఎస్ఐ సస్పెన్షన్, ఇతర పోలీసు అధికారుల బదిలీలను అమలు చేయలేదు. మరోవైపు ఏకంగా ఎన్నికల ప్రధానాధికారినే తొలగించారు'' అని అన్నారు.
''ఉద్యోగులు, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల్లో కోతలు విధించారుగాని, ప్రభుత్వ సలహాదారుల జీతాల్లో కోతలు పెట్టలేదు. తమ యొక్క చట్టవ్యతిరేక చర్యలపై ప్రజా ధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయలేదు'' అని అన్నారు.
''73వ, 74వ సవరణల ద్వారా భారత రాజ్యాంగంలో 9వ భాగం, 9(ఏ)భాగాలను పొందుపరిచారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగంలో ఈ భాగాల్లోని అంశాలను భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా మార్చే అధికారం రాష్ట్రాలకు లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాజ్యాంగంలోని అంశాలను, కేంద్రం ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించకుండా వాటిని విధిగా పాటించేలా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడంలోనూ విఫలమైతే, కేంద్రం వద్ద దానికి తగిన ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయి'' అని యనమల పేర్కొన్నారు.