Asianet News TeluguAsianet News Telugu

ఏపీపై విరుచుకుపడనున్న యాస్ తుఫాను... విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక

యాస్ తుఫాను తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరంవెంబడి గంటకు 60-70 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. 

yaas cyclone effect...  ap disaster management warning akp
Author
Amaravathi, First Published May 26, 2021, 11:51 AM IST

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను ఒడిషాలోని ఉత్తర ధమ్ర- దక్షిణ బాలసోర్ మధ్య ఇవాళ(బుధవారం) తీరం దాటనుంది. ఈ తుఫాను తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరంవెంబడి గంటకు 60-70 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. 

ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువ వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని... సముద్రంలో అలలు  2.5-5.0 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడతాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున  రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు. 

read more   యాస్ తుఫాను భీభత్సం ఖాయం... ఏపీ పరిస్థితి ఇదీ..: ఐఎండీ హెచ్చరిక

ఇదిలావుంటే యాస్ తుపాన్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో అలజడి రేపనుంది. తుఫాను తీరం దాటనున్న ఒడిశాలోని 9 జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. ఈ 9 జిల్లాల్లో ఇప్పటికే రెడ్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణ శాఖ.దమ్రా పోర్టులో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

బెంగాల్ రాష్ట్రంలోని  కోస్టల్ ప్రాంతంతో పాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఈ భారీ వర్షాల కారణంగా సుమారు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకొన్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది  సహాయక చర్యలను చేపట్టారు. నేవీ సిబ్బంది కూడ రంగంలోకి దిగారు.బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ కూడ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. 

ఈ తుఫాన్ కారణంగా  24 పరగణాల జిల్లాల్లో 80 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు విద్యుత్ షాక్ తో మరణించారు.  తుపాన్ ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా సుమారు 20 సెం.మీ పై గా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావిత గ్రామాల ప్రజలకు రిలీఫ్ మెటిరీయల్ ను ఇండియన్ నేవీ సిబ్బంది అందిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో నేవీ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.తుపాన్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఇటీవలనే ప్రధాని  మోడీ మాట్లాడారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడ ఆయా సీఎంలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios