కృష్ణాజిల్లా నూజివీడు డివిజన్‌లోని ముసునూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తహశీల్దార్ మదన్మోహన్ రావుపై మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు.

తమ భూమిని వేరొకరి పేరిట మార్చారనే బాధతో ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన చుండ్రు రాజశేఖర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని అడ్డుకున్న మహిళలు.. ఆగ్రహంతో ఊగిపోతూ తహశీల్దార్‌పై దాడికి ప్రయత్నించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను చెదరగొట్టి తహశీల్దార్‌ను రక్షించారు. అనంతరం ఆయనను ప్రత్యేకమైన గదిలో ఉంచి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.