గుంటూరు జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళా వాలంటీర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ ఆత్మహత్యకు తోటి వాలంటీర్ వేదింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వాలంటీర్ నియామకాల్లో దండిపాలెం గ్రామానికి  చెందిన బాంధవి, శ్రీనివాస్ లు ఉద్యోగాలు పొందారు. అయితే విధినిర్వహణలో భాగంగా కలిసి పనిచేస్తున్న బాంధవిపై శ్రీనివాస్ కన్నేశాడు. తరచూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. 

read  more   పొలం తగాదాలో.. రక్తాలు కారేలా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు..

కొన్నాళ్లపాటు అతడి వేధింపులను భరించిన బాంధవి తాజాగా దారుణ నిర్ణయం తీసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాంధవి మరణంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు శ్రీనివాస్ కు దేహశుద్ది చేసి పోలీసులు అప్పగించారు. 

శ్రీనివాస్ తో ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసుల కూడా ప్రాథమికంగా నిర్దారించారు. తమ కుమార్తె ఆత్మహత్య కు వాలంటీర్ శ్రీనివాస్ వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు... దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చుండూరు పోలీసులు తెలిపారు.