Asianet News TeluguAsianet News Telugu

రుణాల పేరుతో ఘరానా మోసం: చిత్తూరులో మహిళలను మోసం చేసిన ముఠా

స్వయం సహాయక గ్రూపులకు సహాయం పేరుతో బ్యాంకులో ఖాతాలు తెరిపించి డబ్బులు వసూలు చేసి ముగ్గురు సభ్యుల ముఠా పారిపోయింది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, బిఎన్‌కండ్రిగ ప్రాంతాల మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా డబ్బులు వసూలు చేసింది.

Women self help group members complained against meena finace company in Chittoor district
Author
chittoor, First Published Sep 21, 2021, 12:59 PM IST

తిరుపతి: ;పొదుపు పేరుతో పైసాపైసా కూడబెట్టిన డబ్బులను కేటుగాళ్లు నొక్కేశారు. బ్యాంకు ఖాతాలు తెరిచి రుణాలు ఇస్తామని పేదలను నమ్మించి ఈ డబ్బులను స్వాహా చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.
 బ్యాంక్ ఖాతాలు తెరిచి లోన్లు ఇస్తామని చెప్పి పొదుపు పేరుతో డబ్బులు నొక్కేశారు.  స్వయం సహాయక సంఘాలకు సహాయం పేరుతో మోసాలకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్ గా మోసాలకు పాల్పడింది ఓ ముఠా. 

సెంథిల్, కుమార్, రాజ్ కుమార్, సంగీతలు అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా కేంద్రంలో మీనా ఫైనాన్స్ కంపెనీ పేరుతో  ఓ సంస్థను స్థాపించారు. ప్రధాన కార్యాలయం పట్టణంలోనే ఉన్నట్లు తప్పుడు చిరునామాతో బురిడీ కొట్టించారు.జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, బి.ఎన్ కండ్రిగ, ప్రాంతాలకు చెందిన పేదలకు ఆర్థిక సహాయం పేరుతో వడ్డీ లేకుండా ఒక్కో గ్రూపునకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేస్తామని నమ్మించారు.

 శ్రీకాశహస్తి, సత్యవేడు మండలంలోని పలు గ్రామాల్లో కరపత్రాలు పంచి మహిళలను నమ్మించి ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక గ్రూప్ నుండి 10 నుంచి 15 వేల రూపాయలు వసూలు చేశారు. బాధితుల నుంచి ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ రూపేణా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. సంగీత, రాజ్ కుమార్ పేర్ల తో ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయించున్నారు.

ఇదిలావుంటే, కొందరు మహిళలు తమ అవసరాల కోసం రుణాలు పొందేందుకు సంస్థ నిర్వాహకులను సంప్రదించారు. ఇవాళ, రేపు అంటూ దాటవస్తూ రావడంతో అనుమానం వచ్చి ఫోన్ చేయడంతో సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు నిర్వాహకులు. 

దీంతో తాము మోసపోయామని భావించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించారు. కష్టపడి పోగేసిన సొమ్మును కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసి తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సంస్థ నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios