మహిళా పోలీసులను పోలీసుల బాధ్యతల కోసం వినియోగించుకోరాదని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా ఆదేశించారు. బందోబస్తు, రిసెప్షన్, శాంతి భద్రతల వంటి అంశాలకు మహిళా పోలీసులను ఉపయోగించుకోరాదని పోలీసు కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగించరాదని తెలిపారు. మహిళా పోలీసును ఎందుకు ఏర్పాటు చేశామో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లోని మహిళలు, చిన్నారుల సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని, బాధితులకు కావాల్సిన పూర్తి సహాయ సహకారాలను అందించడమే మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం వెనుక గల ముఖ్య ఉద్దేశం అని వివరించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసులను పోలీసు శాఖలోని సాధారణ విధుల కోసం వినియోగించరాదని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిర్దేశించారు. బందోబస్తు, రిసెప్షన్, శాంతి భద్రతల వంటి బాధ్యతల కోసం వారిని ఉపయోగించరాదని స్పష్టం చేశారు. 

అలాగే, వారిని తరుచూ పోలీసు స్టేషన్‌లకు పిలవరాదని డీజీపీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఎవరైనా పై ఆదేశాలకు విరుద్ధంగా మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: ఏపీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. స్పందించిన వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్ ఇటీవలే మహిళా పోలీసు శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.