45 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన మహిళ.. నలుగురు నానా మాటలు అంటారేమోనని భయపడి స్వయంగా అబార్షన్‌ చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా మదనపల్లి అమ్మినేని వీధిలో నివసిస్తున్న ఇనయతుల్లా, కదిరున్నీషా దంపతులు టైలరింగ్ పనిచేస్తున్నారు.

వీరికి పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారు. అయితే 8 నెలల క్రితం కదిరున్నీషా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పకుండా రహస్యంగా వచ్చింది. ఈ క్రమంలో ఆమె శరీరంలో మార్పులు మొదలయ్యాయి.

రాను రాను పొట్ట భాగం ముందుకు వచ్చి గర్భం దాల్చినట్లు కనబడుతుండటంతో ఆందోళనకు గురైంది. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలుండగా గర్భం దాల్చావని చుట్టుపక్కల వాళ్లు సూటిపోటి మాటలు అంటారని భావించిన కదిరున్నీషా మరింత భయపడిపోయింది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్‌రూంలో బలవంతంగా అబార్షన్ చేసుకుంది. బయటికి వచ్చిన ఆడబిడ్డను ప్లాస్టిక్ కవర్‌లో చుడుతుండగా.. అధిక రక్తస్రావం కారణంగా కదిరున్నీషా బాత్‌రూంలోనే కుప్పకూలింది.

కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు బాత్‌రూమ్‌లో ఆమెను గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కదిరున్నీషా మరణించింది. ఆడ శిశువు వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉంది. భార్య మరణించడంతో ఇనయతుల్లా కన్నీరుమున్నీరవుతున్నాడు.