అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. 

తాడేపల్లిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసేందుకు వచ్చారు. అయితే అప్పటికే వైయస్ జగన్ ఇంటికి వెళ్లిపోవడంతో ఆమె వెనుదిరిగిపోయారు. మంగళవారం వైయస్ జగన్ పులివెందుల, తిరుపతి పర్యటనలు ఉన్న నేపథ్యంలో బుధవారం కలిసే అవకాశం ఉంది. 

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఆయనకు అభినందనలు తెలియజేసేందుకు నన్నపునేని రాజకుమారి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే నన్నపనేని రాజకుమారి కుమార్తె అల్లుడు కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు. 

2014 ఎన్నికల్లో నన్నపనేని రాజకుమారి కుమార్తె నన్నపునేని సుధ గుంటూరు జిల్లా వినుకొండ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆనాటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.