విజయవాడ: వైద్యం కోసం వచ్చిన తన వద్దకు వచ్చిన ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచక డాక్టర్. క్లినిక్ లోనే మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాదు కోరిక తీర్చడానికి నిరాకరించిన ఆమెను కులం పేరుతో దూషించాడు. ఎలాగోలా కామాంధుడయిన ఈ డాక్టర్ నుండి తప్పించుకున్న మహిళ కుటుంబసభ్యుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన ప్రముఖ ఎముకల డాక్టర్ రాజేంద్ర విజయవాడలో సొంతగా ఓ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతడి వద్దకు ఓ దళిత మహిళ వైద్యం కోసం వెళ్లింది. అయితే వైద్య పరీక్షల పేరుతో ఆమెతో డాక్టర్ రాజేంద్ర అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా తన లైంగిక వాంఛ తీర్చమని మహిళను వేధించాడు. 

అతడి ప్రవర్తనతో భయాందోళనకు లోనయిన మహిళ ఎలాగోలా అక్కడినుండి తప్పించుకుంది. నేరుగా కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి డాక్టర్ పై ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించడమే కాదు కులం పేరుతో దూషించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు రాజేంద్ర ను అరెస్ట్ చేశారు.