విజయవాడ ఆస్పత్రిలో దారుణం.. డాక్టర్ల నిర్లక్ష్యంతో చేతిని కోల్పోయిన మహిళ...
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళ చేతిని కోల్పోయిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. ఆపరేషన్ చేసి పరికరాన్ని అందులోనే పెట్టి కట్టు కట్టారు.
విజయవాడ : డాక్టర్ల నిర్లక్ష్యం ఓ మహిళ పాలిట శాపంగా మారింది. చేతికి గాయం అయ్యిందని ఆస్పత్రిలో చేరితే.. ఏకంగా చేతినే కోల్పోవాల్సి వచ్చింది. చేతికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆపరేషన్ చేసిన సర్జరీ పరికరాన్ని చేతికే పెట్టి కట్టు కట్టేశారు. దీంతో ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఇప్పుడు చేతిని పూర్తిగా తొలగించాలని డాక్టర్లు చెప్పారు. దీనిమీద బాధిత మహిళ, కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు...
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళా కూలి తన చేతిని కోల్పోవాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. గుర్తుతెలియని పురుగు కుట్టి ఆసుపత్రికి వచ్చిన ఆ మహిళకు ఆపరేషన్ చేసి.. బ్లేడును మరిచిపోయి అలాగే కట్టు కట్టేశారు. దీంతో చేయి మొత్తం ఇన్ఫెక్షన్స్ సోకింది. డ్రెస్సింగ్ చేసే సమయంలో ఇది గమనించిన వైద్యులు.. చేతికి ఇన్ఫెక్షన్ సోకిందని పూర్తిగా తీసివేయాల్సి వస్తుందని చెప్పడంతో ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి అయోమయంగా మారిపోయింది.
వైసీపీ నేత దారుణ హత్య.. టీడీపీ నేత కుమార్తెతో కొడుకు ప్రేమపెళ్లితో..
విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ లో తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట గ్రామానికి చెందిన ఓ మహిళ వైద్యం కోసం చేరింది. ఈ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి భార్య తులసి ఇల్లు సర్దుతుంటే ఏదో పురుగు ఆమెను కొట్టింది. దీంతో చేతికి బొబ్బలు వచ్చాయి. విష పురుగు కుట్టిందని అనుమానించి వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఏ పురుగు కుట్టిందో గుర్తించలేకపోతున్నామని.. తాత్కాలికంగా ఒక నాలుగు ఇంజక్షన్లు ఇచ్చి నూజివీడు ఏరియా ఆసుపత్రికి సజెస్ట్ చేశారు.
వైద్యుల సలహాతో నూజివీడు ఆసుపత్రికి వెళ్లిన ఆమెను అక్కడ పరిశీలించిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ ప్రారంభమైందని మెరుగైన వైద్యం కోసం విజయవాడ వెళ్లాలని తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత మహిళకు వెంటనే వైద్యం అందలేదు. చేతి బొబ్బలు తీవ్రంగా నొప్పి వేయడంతో భరించలేక ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళుతున్న సమయంలో ఓ మహిళా డాక్టర్ వచ్చి ఆమెను చూశారు. ఆమె చాలా సీరియస్ కండిషన్లో ఉందని ఇప్పటివరకు వైద్యం ఎందుకు అందించలేదని అక్కడివారిని కోప్పడి.. వెంటనే వైద్యం చేశారు.
ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాన్ని కట్ చేసి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆ గాయాన్ని కట్లు కట్టే సమయంలో అందులో సిబ్బంది బ్లేడు మరిచిపోయి అలాగే కట్టేశారు. దీంతో ఇన్ఫెక్షన్ తగ్గాల్సింది పోయి పూర్తిగా చేతికి వ్యాపించింది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా తన పరిస్థితి మెరుగు కాకపోవడం.. డ్రెస్సింగ్ సమయంలో ఆపరేషన్ చేసిన ప్రాంతంలో బ్లేడు కనిపించడంతో.. ఆమె షాక్ అయ్యింది. ఆమెను పరిశీలించడానికి వచ్చిన డాక్టర్లు.. చేతికి పూర్తిగా ఇన్ఫెక్షన్ సోకిందని, చేయి తొలగించాలని తెలిపారు.
చిన్న గాయంతో ఆసుపత్రికి వస్తే పూర్తిగా తన చేతినే తొలగిస్తాననిడంతో ఇప్పుడు ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. తులసికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబం. భార్యాభర్త ఇద్దరు కూలీ పనులు చేసుకుంటే కానీ కుటుంబం గడవని పరిస్థితి. దీంతో వారు బాధ వర్ణనాతీతంగా మారింది.. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం అందించి చేయి తీయకుండా ఉండేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.