తల్లి అవ్వడం కోసం ఆమె ఎంతో కాలం ఎదురు చూసింది. పెళ్లైన ఆరు సంవత్సరాల తర్వాత ఆమె తల్లి కాబోతున్నాన్న శుభవార్త విన్నది. కానీ రాక రాక వచ్చిన గర్భం కూడా నిలవలేదు. దీంతో ఇక తాను జన్మలో తల్లిని కాలేనన్న బాధతో ఆమె ప్రాణాలను విడిచింది. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం నగరంలోని కొత్తపేట లోలుగునగర్ కు చెందిన చిన్నంశెట్టి వాసవి(33)కి పశ్చిమగోదావరి జిల్లా కైకలూరు సమీపంలోని కోరుకల్లుకు చెందిన సుబ్రహ్మణ్యంతో 2013లో వివాహం జరిగింది. అతను సాఫ్ట్ వేర్  ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యభర్తలు ఇద్దరూ లండన్ లో స్థిరపడ్డారు.

వచ్చే నెల తన చెల్లెలి వివాహం ఉండటంతో.. స్వగ్రామానికి వచ్చారు. భర్త ఆఫీసు పనిమీద బెంగళూరులో ఉండగా.. ఆమె తన పుట్టింటిలో ఉంది. పెళ్లి జరిగిన ఆరు సంవత్సరాలకు ఆమె గర్భం దాల్చడంతో చాలా సంబరపడిపోయింది. అయితే.. ఆమె ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. 

ఈ నేపథ్యంలో వాసవికి కడుపులో నొప్పు వస్తుందని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్ళి ఒక ఆసుపత్రిలో చెకప్‌ చేయించుకోగా గర్భస్రావం జరిగిందని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె అప్పటి నుంచి ఒత్తిడికి లోనైందని చెప్తున్నారు. గత కొన్నేళ్ళుగా పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిందని అంటున్నారు. 

ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం దాటిన తర్వాత వారి భవనం పై గదిలోకి వెళ్ళి ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుంది. చాలా సేపటి వరకూ పైగది నుంచి కిందకి రాకపోవడంతో కుటుంబీకులు వెళ్ళి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. సమాచారం అందుకున్న భర్త బెంగుళూరు నుంచి నగరానికి చేరుకున్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాయఛాయలు అలుముకున్నాయి.