ఆయన ఓ ఆర్ఎంపీ వైద్యుడు. ఊర్లో ఎవరికి వైద్యం అవసరం వచ్చినా.. ఈయనే ముందుండేవాడు. అయితే.. అతనికి భార్యతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో... ఆమెను వదిలేసాడు. తర్వాత అతని జీవితంలోకి మరో యువతి ప్రవేశించింది. ఆ యువతితో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. అయితే.. ఆ యువతే అతని పాలిట మృత్యుపాశమైంది. డబ్బు కోసం ఆ డాక్టర్ ని చంపేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెరుకుపల్లికి చెందిన బల్లిపల్లి చిరంజీవి(43) ఆర్ఎంపీ వైద్యుడు. భార్య మాధవితో మనస్పర్థలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం అమృతలూరు మండలం ఇంటూరుకు చెందిన సాయి శిరీష(23) తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు సహజీవనం చేయడం ప్రారంభించారు. వారిద్దరి మధ్య 20ఏళ్ల వయసు వ్యత్సాసం కూడా ఉండటం గమనార్హం.

ఈ క్రమంలో సాయి శిరీష పై చిరంజీవికి అనుమానం మొదలైంది. మరెవరితోనైనా వెళ్లిపోతుందేమో అనే భయంతో వేధించడం మొదలుపెట్టాడు. అయితే.. అతని వేధింపులు యువతి తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆమెకు భానుప్రకాశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పథకం ప్రకారం ఇద్దరూ కలిసి.. చిరంజీవిని హత మార్చారు.

అతని వద్ద ఉన్న రూ.12లక్షలు తీసుకొని ఉడాయించారు. మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి పాతిపెట్టడం గమనార్హం. అయితే.. చిరంజీవి కనిపించకపోవడంతో.. అతని తండ్రి ఫిర్యాదు చేయగా.. అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.