అతనికి అప్పటికే పెళ్లయ్యింది. అయితే.. భార్య చనిపోవడంతో.. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అలా రెండో పెళ్లి చేసుకోవడమే అతనిపట్ల శాపమైంది. ఆస్తి కోసం ఆ రెండో భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ సంఘటన నారాయణఖేడ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూల్‌ జిల్లా అదోనికి చెందిన మునుస్వామి(55) గత 30ఏళ్లుగా నారాయణఖేడ్‌ ఎస్‌బీఐ ఏడీబీ బ్యాంకులో సీనియర్‌ మెసెంజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మునుస్వామి మొదటి భార్య 2015లో అనారోగ్యంతో  చనిపోయింది. దీంతో అతడు 2016లో నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన సంతుబాయిని రెండో వివాహం చేసుకున్నాడు. 

మొదటి భార్య పిల్లలు కర్నూల్‌ జిల్లా అదోనిలో ఉంటుండగా, మునుస్వామి తన రెండో భార్య సంతుబాయితో కలిసి నారాయణఖేడ్‌లోని భవానీ కాలనీలో సొంత ఆర్‌సీసీ భవనంలో ఉండేవాడు. ఈ క్రమంలో రెండోభార్య భర్త పేరిట ఉన్న ఇంటిని తన పేరిట మార్చాలని కోరినప్పటికీ మునుస్వామి ఒప్పుకోలేదు.

ఈ విషయమై భర్తతో సంతుబాయి గొడవ పడింది. ఈ క్రమంలో ఆమె పట్టణానికి చెందిన నసీర్‌మియా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.  భర్త ఆస్తిని దక్కించుకునేందుకు ఆమె ప్రియుడితో కలిసి  ప్లాన్‌ వేసింది. ఈ మేరకు జూలై 4న అర్ధరాత్రి ప్రియుడు నసీర్‌మియాను ఇంటికి పిలిపించుకొని నిద్రిస్తున్న మునుస్వామిపై దాడి చేశారు. 

ఇరువురు కలిసి అతడిని చున్నీతో గొంతు నులిమేందుకు యత్నించగా మునుస్వామి నిద్రనుండి లేస్తుండడంతో నసీర్‌ మియా తన వెంట తెచ్చుకున్న ఇనుప సుత్తెతో మోది హత్య చేశాడు. అనంతరం  ఇంట్లో కాలు జారి పడిపోవడంతో చనిపోయినట్లు తెలిపారు. 

అయితే మృతుడి మొదటి భార్య కుమారుడు నర్సింహులు తమ తండ్రి మృతిపై అనుమానాలున్నట్టు ఫిర్యాదు చేయడంతో నారాయణఖేడ్‌ ఎస్‌ఐ సందీప్‌, సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. మంగళవారం నిందితులు పారిపోయేందుకు యత్నిస్తుండగా సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో  ఆస్తికోసం భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు సంతుబాయి అంగీకరించినట్టు తెలిపారు.